కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో అటవీ, పోలీసు శాఖల అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా కలప(Illegal Timber), ఇసుక తరలిస్తున్న వాహనాలను మంగళవారం సీజ్ చేసి, కేసులు నమోదు చేశారు. దమ్మపేట అటవీ రేంజ్ పరిధిలోని గణేష్‌పాడు, చీపురుగూడెం ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా లారీ, ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 10 టన్నుల కలపను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ కలప విలువ సుమారు రూ.43,875 ఉంటుందని గుర్తించారు. కలప తరలిస్తున్న రెండు వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు.
అలాగే, అశ్వారావుపేట మండలం గాడ్లగూడెం గ్రామ శివారులోని పెద్దవాగు వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులను ఎస్ఐ బి. సాయి కిషోర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఇసుక లోడుతో ఉన్న నాలుగు ట్రాక్టర్లు, రెండు ఖాళీ ట్రాక్టర్లు, ఒక ట్రాక్టర్ ఇంజన్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రకృతి సంపదను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

