కలం, కుంటాల: రైతులను సమన్వయం చేసుకుంటూ భూముల రీ సర్వే (Land Resurvey) ప్రక్రియను పకడ్బందీగా, వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం కుంటాల మండలం రాజాపూర్ తాండలో (Rajapur Thanda) కొనసాగుతున్న భూముల రీ సర్వే పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. గ్రామంలో చేపడుతున్న సర్వే పురోగతిని, ఇప్పటివరకు పూర్తయిన పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
భూముల హద్దుల నిర్ధారణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి సర్వే చేపట్టాలని భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) సూచించారు. సర్వే ప్రక్రియలో రైతులకు అవసరమైన అవగాహన కల్పిస్తూ, వారి సమన్వయంతో పనులు చేపట్టాలని అన్నారు. సర్వే సమయంలో సంబంధిత అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.
రీ సర్వే పనులను మరింత సులభతరం చేసి వేగవంతం చేసేందుకు త్వరలో అదనంగా ఆధునిక సర్వే పరికరాలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సర్వే సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సిబ్బంది వద్ద తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో తహసీల్దార్ కమల్ సింగ్, రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు పాల్గొన్నారు.

