కలం, బూర్గంపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం బుడ్డగూడెం (Buddagudem) గ్రామంలో మహిళా సంఘం భవనం (Womens Association Building) నిర్మాణానికి ఎంపీడీవో జమలారెడ్డి మంగళవారం భూమిపూజ చేశారు. ఈ పథకం ‘వీబీ-జీ రామ్ జీ’ నిధులతో రూ.10 లక్షల అంచనా వ్యయంతో భవన నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈ భవన నిర్మాణం పూర్తయితే మహిళా స్వయం సహాయక సంఘాల సమావేశాలు జరుపుకోవడంతో పాటు, మహిళా సంఘాల పొదుపులు, రుణాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాటి లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, సోంపల్లి గ్రామపంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఎంపీడీవో జమలారెడ్డి ఫార్మ్ ఫండ్ పథకాన్ని తనిఖీ చేసి, అమలు తీరును పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తూ, సంబంధిత పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు.

