కలం, వెబ్ డెస్క్: నల్గొండ (Nalgonda) జిల్లా కట్టంగూరు (Kattangur) మండలం చెరువు అన్నారం స్టేజి వద్ద జాతీయ రహదారిపై చైన్ స్నాచర్లు బీభత్సం సృష్టించారు. నకిరేకల్ నుండి ఆటిపాముల వైపు తన కొడుకుతో కలిసి బైక్ పై వెళ్తున్న హిమబిందు అనే మహిళను దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. ఎదురుగా బైక్ పై హెల్మెట్లు ధరించి వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని దుండగులు, హిమబిందు ప్రయాణిస్తున్న బైకును బలంగా ఢీకొట్టారు.
దీంతో తల్లీకొడుకులు ఇద్దరూ రోడ్డుపై కిందపడిపోయారు. రోడ్డుపై పడిపోయిన మహిళపై దుండగులు కట్టర్తో దాడిచేశారు. అనంతరం ఆమె మెడలోని 3 తులాల బంగారు పుస్తెలతాడును కట్టర్తో కట్ చేసి లాక్కొని పరారయ్యారు. దుండగులు కట్టర్తో దాడి చేయడంతో బాధితురాలు హిమబిందు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటనపై బాధితురాలు కట్టంగూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, జాతీయ రహదారిపై ఉన్న సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ముగ్గురు దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

