కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎల్ నినో (El Nino Telangana) ప్రభావం అధికార కాంగ్రెస్ లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అయితే, ఓట్ల కోసం గ్రామాల్లోకి వెళ్లినప్పుడు కరెంట్, సాగునీటి కష్టాలతోపాటు ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలపై ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనన్న టెన్షన్ పార్టీ నేతలను వెంటాడుతున్నది.
రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్లు, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలు, ఖైరతాబాద్ ఉప ఎన్నిక కూడా కాంగ్రెస్‌కు సవాల్‌గా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాల విశ్లేషణ. ఎల్ నినో ప్రభావం తగ్గిన తర్వాతే కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉండగా, ఖైరతాబాద్ ఉప ఎన్నిక మాత్రం షెడ్యూల్ ప్రకారమే జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
అదే అసలు పరీక్ష, సవాల్
ఎల్ నినో పరిస్థితులపై క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నది. తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ముందస్తు కార్యాచరణతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదని, ప్రపంచవ్యాప్తంగా విపత్కర పరిస్థితులు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పదే పదే స్పష్టం చేస్తున్నారు.
అయితే, గ్రౌండ్ లెవెల్లో తలెత్తే ప్రజా సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. అటు తాగునీరు, ఇటు విద్యుత్ సరఫరాకు సంబంధించి క్షేత్రస్థాయి వాస్తవాలను ప్రజలకు వివరించి ఒప్పించడమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అసలైన సవాల్‌గా, కీలక పరీక్షగా మారనుంది.
విపక్షాల విమర్శలకు కౌంటర్లు
ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ శ్రేణులు గెలుపుపై ధీమాగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎప్పటికప్పుడు ఎల్ నినో తీవ్రతపై తాము చైతన్యపరుస్తున్నామని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. స్వయంగా సీఎం, మంత్రులు కూడా నిత్యం ఈ విపత్తు ప్రభావంపై మాట్లాడుతున్నందున ప్రజలు సైతం వాస్తవాలను అర్థం చేసుకుంటారని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి ప్రాజెక్టుల అంశాలపై అధికార, విపక్షాల మధ్య రాజకీయ విమర్శలు ముదిరాయి. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం, కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ అంశాలు మరోసారి తెరపైకి వచ్చాయి. విపక్షాల ఆరోపణలకు మంత్రులు, ప్రభుత్వ విప్‌లు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తుండగా.. రాబోయే రోజుల్లో ఈ అంశాలు రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం ఉన్నది.

