కలం, జోగులాంబ గద్వాల: గద్వాల మండలం కొండపల్లి (Kondapalli) రోడ్డులో గల “హరిత కాటన్ ఇండస్ట్రీస్” మిల్లులో గద్వాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రం సోమవారం ప్రారంభమైంది. 2026-27 ఖరీఫ్ సీజన్ పత్తి కొనుగోళ్ల కోసం ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సీసీఐ ఇన్చార్జ్ రాహుల్ కొబ్బరికాయ కొట్టి దీన్ని ప్రారంభించారు. పత్తిలో తేమ శాతం 8% కంటే తక్కువగా ఉన్నట్లయితే ప్రభుత్వ మద్దతు ధర రూ.8,667 లభిస్తుందని గద్వాల మార్కెట్ కమిటీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి ఎల్లస్వామి తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మిల్లు యాజమాన్యం, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

