భువీకి మోర్కెల్ అండ.. ఒత్తిడి వద్దు!

క‌లం, స్పోర్ట్స్‌: టీమిండియాలోకి నాలుగేళ్ల తర్వాత తిరిగొచ్చిన సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ (Bhuvneshwar Kumar)కు ఆశించిన ఆరంభం దక్కలేదు. న్యూజిలాండ్‌తో తొలి రెండు టీ20ల్లో భారీగా పరుగులు ఇచ్చాడు. దీంతో అతడిపై అంచనాలు పెరిగిన వేళ.. భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ (Morne Morkel) అండగా నిలిచాడు. ఒత్తిడికి లోనుకాకుండా తన సహజమైన ఆటను కొనసాగించాలని సూచించాడు. భువనేశ్వర్‌కు అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి అలవాటు పడేందుకు మరికొంత సమయం ఇవ్వాలని మోర్కెల్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించినప్పటికీ, అంతర్జాతీయ క్రికెట్‌లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని వివరించాడు.

పరిమితమైన ప్రాక్టీస్‌తో జట్టులోకి వచ్చిన భువీ.. తన లయను అందుకోవడానికి కొన్ని మ్యాచ్‌లు అవసరమని పేర్కొన్నాడు. ఐపీఎల్‌ 2026లో భువనేశ్వర్ 16 మ్యాచ్‌ల్లో 28 వికెట్లు తీసి సత్తా చాటాడు. అయితే న్యూజిలాండ్‌తో తొలి టీ20లో వికెట్ తీయకుండా 49 పరుగులు ఇచ్చాడు. రెండో మ్యాచ్‌లో ఒక వికెట్ తీసినా 50 పరుగులు సమర్పించుకున్నాడు. మరోవైపు, రెండో టీ20లో మయాంక్ యాదవ్ స్థానంలో ప్రిన్స్ యాదవ్‌ను ఆడించడంపైనా మోర్కెల్ వివరణ ఇచ్చాడు. ఇది కేవలం వ్యూహాత్మక నిర్ణయమేనని స్పష్టం చేశాడు.

మంచు కారణంగా బంతి తడిగా మారే అవకాశం, మైదానం పరిమాణం, చివరి ఓవర్లలో యార్కర్లు వేయగల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపాడు. మొదటి మ్యాచ్‌లో మయాంక్ బాగా బౌలింగ్ చేశాడని, అతడిని పక్కన పెట్టడానికి ప్రదర్శన కారణం కాదని మోర్కెల్ పేర్కొన్నాడు. యువ బౌలర్‌గా మయాంక్‌కు తన బౌలింగ్‌ను విశ్లేషించుకోవడానికి సమయం ఇవ్వడం మంచిదేనని అభిప్రాయపడ్డాడు. ఓవర్‌ను ఎలా ప్లాన్ చేయాలి, బ్యాటర్ల ఆటను ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాల్లో అతడు ఇంకా అనుభవం సంపాదించాల్సి ఉందని వివరించాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>