కలం, భువనగిరి: రైతులు కష్టపడి పండించిన ప్రతి ధాన్యం గింజకూ తగిన మద్దతు ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెస్తోందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (Kumbam Anil Kumar Reddy) తెలిపారు. సోమవారం పోచంపల్లి మండలంలోని పిలాయిపల్లి, జగత్పల్లి గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే (Anil Kumar Reddy) మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ దళారులను ఆశ్రయించి నష్టపోకూడదన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధరతో లబ్ధి పొందాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీరు, నీడ, టార్పాలిన్లు వంటి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఎలాంటి అవాంతరాలు లేకుండా పారదర్శకంగా, సజావుగా జరిగేలా సంబంధిత అధికారులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో పోచంపల్లి, జూలూరు పీఏసీఎస్ చైర్మన్లు పాక మల్లేష్ యాదవ్, కళ్లెం రాఘవరెడ్డి, స్థానిక సర్పంచులు మహాలక్ష్మి, గీతా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సామా మధుసూదన్ రెడ్డి, మోహన్ రెడ్డి, అంబరీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఉప్పునూతల వెంకటేష్, పిఎసిఎస్ వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.

