కలం, వెబ్‌డెస్క్: ఏపీలోని ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు (Naguluppalapadu) మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ దుర్మార్గుడు గంజాయి మత్తులో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు. స్థానికులు నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిని చదలవాడ ఎస్సీ కాలనీకి చెందిన అజ్జం ఆనంద్‌గా గుర్తించారు. స్థానికంగా నివసించే ఓ దంపతులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లారు. తమ ఆరేళ్ల కుమార్తెను అమ్మమ్మ వద్ద వదిలి వెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి బాలిక అమ్మమ్మ వద్ద నిద్రిస్తున్న సమయంలో ఆనంద్ బాలిక ఇంటి వద్దకు వచ్చాడు. నిద్రలో ఉన్న బాలికను అక్కడి నుంచి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొని వెళ్లాడు. బాలికపై అత్యాచారం చేశాడు.
అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను ఇంటికి తీసుకొచ్చి ఇంటి ముందు కుర్చీలో కూర్చోబెట్టి వెళ్లాడు. కుర్చీలో పాపను చూసిన అమ్మమ్మ దిగ్భ్రాంతికి గురైంది. స్థానికులకు విషయం చెప్పడంతో వెంటనే ఒంగోలులోని రిమ్స్ కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక ప్రాణాలు కోల్పోయింది. స్థానికులు నిందితుడు ఆనంద్‌ను పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులు అప్పగించారు. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే విజయ్ కుమార్ పరామర్శించారు. ఆయన స్వయంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో ఫోన్లో మాట్లాడి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

