ప్రజాస్వామ్య పరిరక్షణే కాంగ్రెస్ లక్ష్యం : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మూడో దశ ఉద్యమం ‘ఓటు బచావో – దేశ్ బచావో’ ప్రచారాన్ని చేపడుతోందని ఏఐసీసీ పరిశీలకులు రవీందర్ దాస్, ఎమ్యెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) తెలిపారు. సోమవారం మహబూబ్‌నగర్ నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

గతంలో మొదటి దశలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆందోళనలు నిర్వహించామని, రెండో దశలో దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం మూడో దశలో భాగంగా ఓటర్ల హక్కుల పరిరక్షణే ప్రధాన అజెండాగా ప్రజల్లోకి వెళ్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాల నిర్వహణలో చోటుచేసుకుంటున్న మార్పులు, పేర్ల తొలగింపులు, చేర్పులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టనున్నట్లు రవీందర్ దాస్ తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బూత్ స్థాయి ఏజెంట్లు ప్రతి నియోజకవర్గంలోని ప్రతి బూత్ పరిధిలో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితాలను పరిశీలిస్తారని రవీందర్ దాస్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) అనంతరం ఓటర్ల జాబితాల్లో జరిగిన మార్పులతో పాటు ఫారం-6, ఫారం-7 దరఖాస్తులకు సంబంధించిన వివరాలను సేకరిస్తామన్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడినట్లు గుర్తిస్తే, నిబంధనల ప్రకారం తిరిగి వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ప్రతి బూత్ నుంచి సేకరించిన సమాచారాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ ద్వారా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి, అక్కడి నుంచి ఏఐసీసీ కేంద్ర నియంత్రణ విభాగానికి పంపిస్తామని రవీందర్ దాస్, యెన్నం (Srinivas Reddy) వివరించారు. ఓటు హక్కు పరిరక్షణ, ప్రజాస్వామ్య బలోపేతం కోసం నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి, ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లా, నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు.

దేశవ్యాప్తంగా సేకరించే సమాచారాన్ని విశ్లేషించి, ఓటర్ల జాబితాల్లోని లోపాలు, అవకతవకలను ప్రజల ముందుంచుతామని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, రాజ్యాంగ విలువలను పరిరక్షించడం, ప్రజల గొంతుకను బలోపేతం చేయడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యాలని రవీందర్ దాస్ పేర్కొన్నారు. ఈ ఉద్యమాన్ని విజయవంతం చేసేందుకు మీడియా ప్రతినిధులు సహకరించాలని కోరారు. ప్రెస్‌మీట్ అనంతరం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించి, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచార కార్యాచరణపై చర్చించారు. అనంతరం బిఎల్ఎలతో జరిగిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, ఎన్ పి వెంకటేష్, సిరాజ్ ఖాద్రీ, సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, సిజే బెనహర్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అజ్మత్ అలి, ఎస్సీ సెల్ చైర్మన్ పసుల రాజు, కార్పొరేటర్లు సిజె పూజిత, తాహేర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>