కలం, తెలంగాణ బ్యూరో: తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు (Tummidihatti Project)పై సోమవారం కీలక భేటీ జరగనుంది. దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (CM Devendra Fadnavis)తో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముంబై వెళ్లారు. ఈ మేరకు నేడు సీఎంతో భేటీ కానున్నారు. బ్యారేజీ ఎత్తుపై రెండు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొనడంతో ఏకాభిప్రాయం సాధించడమే లక్ష్యంగా ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఇద్దరు ముఖ్యమంత్రులు, రెండు రాష్ట్రాల సాగు నీటిపారుదల శాఖ మంత్రులు, అధికారులు చర్చలు జరపనున్నారు. బ్యారేజీ ఎఫ్ఆర్ఎల్ (ఫుల్ రిజర్వాయర్ లెవెల్)ను 152 మీటర్ల ఎత్తులో నిర్మించాలని తెలంగాణ ప్రతిపాదిస్తుండగా, 148 మీటర్లు మించొద్దని మహారాష్ట్ర అభ్యంతరం తెలుపుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో వెలువడే నిర్ణయం ఆసక్తికరంగా మారింది.
సీఎం రేవంత్‌కు ప్రతిష్టాత్మకం
ఉమ్మడి ఏపీలో ‘జలయజ్ఞం’ స్కీమ్‌లో భాగంగా మొదలైన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. దీనిపై పదేండ్ల క్రితం (2016 ఆగస్టు 23న) రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మొత్తం ప్రాజెక్టే మూలనపడింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని మళ్లీ చర్చలు ప్రారంభించారు. తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ నిర్మించి ఆదిలాబాద్ మొదలు రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల వరకు గోదావరి జలాలను పారించాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం.
అప్పటి ప్రభుత్వం ఆమోదం తెలపడం, నిధులను కేటాయించడం, పనులు మొదలుపెట్టడం.. ఇవన్నీ 2016 వరకు జరిగాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2016లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ బ్యారేజీ విషయంలో మహారాష్ట్ర నుంచి వెల్లడైన అభ్యంతరంతో ప్రాజెక్టును పక్కన పెట్టారు. దాని స్థానంలో రీడిజైన్ పేరుతో కాళేశ్వరం కట్టారు.
కానీ కాళేశ్వరంలోని మూడు బ్యారేజీలూ వేర్వేరు కారణాలతో ప్రస్తుతం ఫంక్షనింగ్‌లో లేవు. ఆదిలాబాద్ జిల్లా తాగునీటి అవసరాలను కాళేశ్వరం తీర్చలేకపోతున్నదని ప్రస్తావించిన సీఎం రేవంత్‌రెడ్డి.. కొన్ని పనులు పూర్తయిన ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేయడంపై దృష్టి సారించారు. తక్కువ నిర్వహణ వ్యయంతో గోదావరి జలాలను వివిధ జిల్లాల సాగు అవసరాలకు వినియోగించేలా తుమ్మడిహెట్టి ఎత్తుపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడానికి చొరవ తీసుకున్నారు.
తుమ్మడిహెట్టి బ్యారేజీలోని ప్రధానాంశాలు..
గతంలో ఒప్పందాల దశలో ఆగిపోయిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును సాకారం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి 2023 డిసెంబర్ తర్వాత సంబంధిత అధికారులతో పలు సమీక్షలు నిర్వహించారు. 2016 ఆగస్టు 23న అప్పటి తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీని 148 మీటర్లకు పరిమితం చేసింది.
148 మీటర్ల ఎత్తులో ఆశించినంత నీటిని తెచ్చుకునే వీలు లేనందున 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీని నిర్మించేందుకు అంగీకరించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికీ వివరించారు. 2025 డిసెంబర్ 4న ఆదిలాబాద్‌లో ప్రజా పాలన–ప్రజా విజయోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణంపై స్పష్టమైన హామీ ఇచ్చారు. తుమ్మడిహెట్టి నిర్మాణం చేపట్టి ఆదిలాబాద్ పంట పొలాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు.
2026 జనవరిలో నిర్మల్ సభలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఏప్రిల్ 29న బ్యారేజీ నిర్మాణ కార్యాచరణను వేగవంతం చేయాలని, మహారాష్ట్ర ప్రభుత్వంతో వెంటనే సంప్రదింపులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. మే 6న తుమ్మిడిహెట్టి బ్యారేజీపై చర్చలకు సమయం కేటాయించాలని కోరుతూ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖ రాశారు. మే 26న మహారాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి సైతం లేఖ రాశారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీపై చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందానికి సమయం ఇవ్వాలని కోరారు.
బ్యారేజీ ఎత్తు, ముంపు ప్రభావం, ఇతర అంతర్రాష్ట్ర అంశాలపై పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకుందామని విజ్ఞప్తి చేశారు. జూన్ 11న మహారాష్ట్రతో ఉన్న పెండింగ్ అంశాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగేలా సహకరించాలని కోరారు. ఆగస్టు 5న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిశారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపునకు మహారాష్ట్ర అంగీకారం సాధించేందుకు కేంద్రం సహకరించాలని కోరారు.
ముఖ్యమంత్రి వరుస ప్రయత్నాల నేపథ్యంలో కేంద్ర జల సంఘం ఢిల్లీలో తెలంగాణ, మహారాష్ట్ర అధికారులతో సెప్టెంబర్ 1న అంతర్రాష్ట్ర సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర జల సంఘం చైర్మన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై చర్చించారు. సెప్టెంబర్ 3న పుణె సంస్థ నిర్వహించిన బ్యాక్‌వాటర్ అధ్యయనాలను తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర జలవనరుల శాఖకు పంపించింది. 148 నుంచి 152 మీటర్ల వరకు వివిధ నీటిమట్టాల్లో ముంపు ప్రభావాన్ని చూపించే కాంటూర్ మ్యాపులను అందజేసింది.

