కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radhakrishna) పార్టీ మార్పుపై చర్చ జోరందుకుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా జనసేనలో చేరనున్నారంటూ విజయవాడలో ప్రచారం జరుగుతోంది. పటమట ప్రాంతంలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన నాయకులు బ్యానర్లు ఏర్పాటు చేయడం ఈ చర్చకు మరింత ఊతమిచ్చింది. ఈ మేరకు బుధవారం జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో రాధా జనసేన కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం సాగుతోంది.
అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇటీవల రాధా పవన్ కల్యాణ్తో పాటు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడిని వేర్వేరుగా కలవడం కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామాలకు ప్రాధాన్యం ఏర్పడింది. విజయవాడ మేయర్ పదవి జనరల్ కేటగిరీకి కేటాయించడంతో ఆశావహుల మధ్య పోటీపై చర్చ జరుగుతోంది.
కూటమి పొత్తుల్లో భాగంగా మేయర్ స్థానాన్ని జనసేనకు కేటాయిస్తే రాధా లేదా ఆయన భార్య పుష్పవల్లికి అవకాశం దక్కవచ్చన్న ప్రచారం వినిపిస్తోంది. మరోవైపు టీడీపీ నేతలు కూడా ఈ పదవిపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్తో కలిసి పనిచేసిన రాధా, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం ఆయన పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారానికి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

