కలం, నిజామాబాద్ బ్యూరో : వలస జీవుల బతుకులను యుద్ధాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక ఘటన అటు గల్ఫ్ దేశాల్లో ఉన్న వారిని ఇటు తెలంగాణలోని ఆయా గ్రామాల్లో ఉన్న సొంతవారిని వణికిస్తున్నాయి. క్షిపణుల దాడులు బాంబుల మోతల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయం భయంగా గడుపుతున్నారు వలస జీవులు. సౌదీలోని రియాద్ ఎయిర్ పోర్టుపై దాడి ఘటన మరోవైపు రష్యా బార్డర్ లో ఉక్రెయిన్ డ్రోన్ దాడుల్లో మన వాళ్ళు చనిపోవడం గాయాలు కావడంతో మళ్ళీ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమాసియాలో మళ్లీ దాడులు,ఉద్రిక్త పరిస్థితులు ఆవహించాయి. అవి కాస్తా మన తెలంగాణ గల్ఫ్ వలస కుటుంబాల (Telangana Gulf Migrant Families) జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి.
సౌదీ అరేబియా రాజధాని రియాద్ నగరంలోని కింగ్ ఖాలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన భీకర దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయాలపాలయ్యారు. ఇందులో కామారెడ్డి పట్టణంలోని సైలానీ బాబా కాలనీకి చెందిన షేక్ సయీద్ కు తీవ్ర గాయాలైనట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. ఈ ఘటనతో సౌదీలో ఉంటున్న వలస కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. తమ వారి యోగక్షేమాలు తెలుసుకునేందుకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. తామంతా బాగానే ఉన్నామని చెబుతున్నారు.
కానీ ఇక్కడి కుటుంబాల్లో మాత్రం ఆందోళన కనబడుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరులో అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్ పై జరిపిన యుద్ధం పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలకు దారితీసింది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ ఇతర దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగింది. ఇరుదేశాల మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలోని ఇరాన్, కువైట్, బహ్రెయిన్, ఇజ్రాయిల్, జోర్డాన్, ఖతార్, ఓమన్, సిరియా, సౌదీ అరేబియా తదితర దేశాల్లో ఉన్న మనోళ్లు ఎంతో ఆందోళనకు గురయ్యారు. ఏడెనిమిది నెలలుగా పశ్చి మాసియాలో ఉద్రిక్త పరిస్థితులతో వలస కుటుంబాలు ఒత్తిడికి గురవుతున్నాయి..
రష్యా వెళ్లి.. బలవంతంగా సైన్యంలోకి
రష్యాకు వెళ్లిన వారిలో కొందరిని అక్కడి సైన్యంలో పనిచేయిస్తున్నారన్న విషయం ఇటీవల వెలుగు చూసింది. బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామానికి చెందిన మహ్మద్ అఫ్టలాఖాన్తో పాటు నిజామాబాద్ జిల్లా మునిపల్లి తండాకు చెందిన బుక్యా రవీందర్, పెద్దవాల్గోటకు చెందిన సిర్సు అశోక్, దమ్మన్నపేట్ తండా ధర్పల్లికి చెందిన మేగావత్ ప్రకాష్ ఉపాధి నిమిత్తం ఫిబ్రవరిలో రష్యాకు వెళ్లారు. అక్కడ ఆరునెలలు పని చేశాక ఏజెంట్ చేతులెత్తేసి స్వదేశానికి వెళ్లి పోవాలని సూచించాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ నలుగురు ఓ వ్యక్తి ద్వారా రష్యన్ ఆర్మీలో గార్డెనింగ్, లోడింగ్, అన్లోడింగ్ పనులలో చేరారు. అయితేవారిని ఆర్మీలో సైనికులుగా చేర్పించుకుని ఉక్రెయిన్తో యుద్ధం జరుగుతున్న బార్డర్ ప్రాంతంలో ఉంచారు.
ఈ క్రమంలో ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడిలో అఫ్ఘలాఖాన్ మరణించినట్లు పెద్దవాల్లోట్కు చెందిన అతడి సహచరుడు సిర్సు అశోక్ తన భార్యకు వాయిస్ మెస్సేజ్ ద్వారా తెలి పాడు. తాను తప్పించుకుని తిరిగి పట్టుబడగా బేడీలు వేసి చిత్రహింసలు పెడ్తున్నారని ఆ మెస్సేజ్లో ఉంది. ఇది అప్టల్ ఖాన్ కుటుంబాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. రష్యాసైన్యంలో చిక్కుకున్న తన కుమారుడిని స్వదేశానికి రప్పిం చాలన్న ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయని, వారం పదిరోజుల్లో స్వదేశానికి వస్తాడన్న నమ్మ కంతో ఉన్న తరుణంలో అందిన సమాచారం అతడి తండ్రిని హతాశుడిని చేసింది. తన కొడుకు బతికి ఉన్నాడా, చనిపోయాడా అన్న సమాచారం తెలియక ఆ తండ్రి తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. విషయం తెలుసుకున్న బంధుమిత్రులు అప్టల్ ఖాన్ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు.
ఉమ్మడి జిల్లా నుంచి వేలాది మంది..
నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు చెందిన వేలాది మంది బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి పనిచేస్తున్నారు. కువైట్, సౌదీ అరేబియా, ఓమన్, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఇరాన్, ఇరాక్, యూఏఈ, జోర్డాన్ తదితర దేశాల్లో నిర్మాణరంగం క్లీనింగ్, ఇతర పనుల్లో మనవాళ్లు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. రెండు, మూడేళ్లకోసారి ఇంటికి వచ్చిపోతుంటారు. ఆయితే అక్కడ జరిగే రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు మరణాలు ఏటా పదుల సంఖ్యలో ఉంటున్నాయి. వీటితోనే వలస కుటుంబాలు మనోవేదనకు గురవుతుండగా, యుద్ధాలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.
తరతరాలూ గల్ఫ్ దేశాలకే..
తెలంగాణ నుంచి గడిచిన యాభై ఏళ్లుగా వేలాది మంది గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. అప్పట్లో తాత వెళ్లి వస్తే, తర్వాత కొడుకు, ఆ తర్వాత మనవడు ఇలా మూడు తరాల వారు బతుకుదెరువు కోసం గల్ఫ్ బాట పట్టారు. నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చని ఆశతో ఇప్పటికీ ఉమ్మడి జిల్లా నుంచి వేలాది మంది గల్ఫ్ దేశాలకు పయనమవుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధాలు, దాడులతో ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ తాము బలవుతామేమోననే భయంతో బతుకుతున్నారు. ఇటు వారి కుటుంబాలు సైతం తమ వారు ఎలా ఉన్నారోనని ఆందోళన చెందుతున్నారు.

