కలం, భైంసా : మహిళా సాధికారతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపుతున్నాయని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (MLA Pawar Ramarao Patel) అన్నారు. శనివారం భైంసా మండలం వలెగాం గ్రామంలో రూ.20 లక్షల నిధులతో నిర్మించిన మహిళా సమైక్య భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐకేపీ భవనాల నిర్మాణంలో ముధోల్ నియోజకవర్గం రాష్ట్రంలోనే ముందంజలో ఉందని, ముఖ్యంగా భైంసా మండలంలో అత్యధిక భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు.
ఇందుకు సహకరించిన అధికారులు, సర్పంచులను అభినందించారు. వీబీ-జీ రామ్‌జీ పథకం ద్వారా గ్రామాల్లో పొలాలకు వెళ్లే రహదారులను నిర్మించుకోవాలని సూచించారు. జూన్‌లోగా గ్రామస్తులంతా సమష్టిగా కృషి చేసి ఈ పనులను పూర్తి చేసుకోవాలని, గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు అందిస్తానని హామీ ఇచ్చారు. వలెగాం గ్రామానికి ఇప్పటివరకు సుమారు కోటి రూపాయల నిధులు కేటాయించామని, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, ఉపాధి హామీ ఏపీడీ విఠల్, ఐకేపీ ఏపీఎం రమేష్, మాజీ ఎంపీపీ రజాక్, సర్పంచులు సిరం సుష్మారెడ్డి, నాయకులు దిగంబర్, గంగాప్రసాద్, శ్యాంరావు పటేల్, అశోక్, సుధాకర్, వినోద్, మహేందర్, మాజీ సర్పంచ్ లక్ష్మణరావు పటేల్, ఆఖిల్ తదితరులు పాల్గొన్నారు.

