కలం, ఆదిలాబాద్: విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి (Police Attack) చేసి, వారిని నిర్బంధించడంతో పాటు ప్రభుత్వ వాహనాన్ని ధ్వంసం చేసిన ఘటనలో 20 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ (SP Akhil Mahajan) తెలిపారు. పోలీసు ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. సిరికొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వాయిపేట్ గ్రామంలో ఈ నెల 10న గంజాయి కేసు దర్యాప్తు సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు.
ఇచ్చోడ సీఐ సీహెచ్.రమేష్, కానిస్టేబుల్ బత్తుల శివప్రసాద్‌తో పాటు మరో ముగ్గురు పోలీసు సిబ్బంది బంగారుపేట గ్రామానికి వెళ్లారు. గంజాయి కేసులో ఓ నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన నేపథ్యంలో కొందరు వ్యక్తులు గుంపుగా ఏర్పడి పోలీసులపై దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. నిందితులు పోలీసు వాహనంపై రాళ్లు రువ్వడంతో పాటు సిబ్బందిపై కర్రలతో దాడి చేసి గాయపరిచారని తెలిపారు. అనంతరం పోలీసులను బలవంతంగా సర్పంచ్ ఇంటికి తీసుకెళ్లి నిర్బంధించినట్లు వెల్లడించారు.
పోలీసులను చంపుతామని బెదిరించడంతో పాటు ప్రభుత్వ వాహనం, ప్రభుత్వ ఫోన్‌ను ధ్వంసం చేశారని, మరో మొబైల్ ఫోన్ కేసుకు సంబంధించిన సీడీ ఫైల్‌ను అపహరించినట్లు వివరించారు. ఈ ఘటనలో ఇచ్చోడ సీఐ సీహెచ్. రమేష్, కానిస్టేబుల్ బత్తుల శివప్రసాద్, ఏఎస్ఐ రాథోడ్ బలిరామ్, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ భీంరావు, ఏఆర్ కానిస్టేబుల్ గంగారాం గాయపడినట్లు తెలిపారు. కానిస్టేబుల్ బత్తుల శివప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం 20 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు.

