కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో విదేశీ మద్యం (ఫారిన్ లిక్కర్) ధరలను (Foreign Liquor Prices) సగటున 6 శాతం వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 352 విదేశీ మద్యం బ్రాండ్లకు సంబంధించి ధరలను సవరించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. బ్రాండ్ను బట్టి ఫుల్ బాటిల్ రూ.30 నుంచి రూ.100 వరకు ధర పెరిగింది.
ఈ పెంచిన ధరలు ఈ నెల 12వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TSBCL) అధికారిక సర్క్యులర్లో స్పష్టం చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో విదేశీ విస్కీ, వోడ్కా, బ్రాందీ, జిన్ వంటి వివిధ బ్రాండ్ల ధరలు ప్రింట్ అయిన కొత్త ధరల ప్రకారం విక్రయించబడనున్నాయి.

