కలం, తెలంగాణ బ్యూరో: హెచ్ఐవీ (HIV)పై అవగాహన పెంపొందించి, వివక్ష లేని సమాజాన్ని నిర్మించేందుకు సమష్టి కృషి, యువత భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (టీజీసాక్స్) ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.విద్యాసాగర్, ఓయూ (Osmania University) వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ అర్గుమోలం పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం–2026ను పురస్కరించుకుని టీజీసాక్స్, ఉస్మానియా యూనివర్శిటీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఓయూ ప్రాంగణంలో అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల నుంచి ఠాగూర్ ఆడిటోరియం వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో సుమారు 2వేల మంది విద్యార్థులు, వాలంటీర్లు, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హెచ్ఐవీ/ఎయిడ్స్ నివారణ, ముందస్తు పరీక్షలు, క్రమం తప్పకుండా చికిత్స తీసుకోవడం, బాధితుల పట్ల వివక్ష, కళంకాన్ని నిర్మూలించడం వంటి నినాదాలతో ర్యాలీ చేపట్టారు.
అనంతరం ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన సభలో పీడీ విద్యాసాగర్, ప్రొఫెసర్ కుమార్ అర్గుమోలం ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. సమాజ సహకారంతోనే హెచ్ఐవీ నియంత్రణ సాధ్యమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, అవగాహన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అవగాహన కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. అవగాహన ప్రచారంలో భాగస్వాములైన వారికి అతిథులు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆరోగ్యకరమైన, వివక్ష రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా తెలంగాణ వ్యాప్తంగా హెచ్ఐవీ నివారణ, పరీక్షలు, చికిత్స, సంరక్షణ సేవలను మరింత బలోపేతం చేస్తామని టీజీసాక్స్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. 95-95-95లక్ష్యాలను చేరుకోవడానికి కట్టుబడి ఉన్నామని ‘న్యాకో’ పేర్కొంది. “95-95-95కోసం అందరం కలిసికట్టుగా, హెచ్ఐవీ రహిత, సురక్షిత తెలంగాణ కోసం కలిసికట్టుగా”అనే నినాదంతో కార్యక్రమం ముగించారు.

