మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం.. వృద్ధురాలు మృతి!

కలం, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలోని నలాసోపారా ( Nalasopara Fire) ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నలాసోపారా-వసాయి లింక్ రోడ్డులో ఉన్న ‘ఇంపీరియల్ హైట్స్’ అనే బహుళ అంతస్తుల నివాస సముదాయంలో అకస్మాత్తుగా అగ్నికీలలు చెలరేగాయి. 13వ అంతస్తులోని ఒక ఫ్లాట్‌లో ప్రారంభమైన ఈ మంటలు, నిమిషాల వ్యవధిలోనే పక్కనే ఉన్న ఇతర ఫ్లాట్లకు, పైఅంతస్తులకు వేగంగా వ్యాపించడంతో తీవ్ర కలకలం రేగింది. అగ్నికీలలు, దట్టమైన పొగ కారణంగా భవనంలో ఉన్న నివాసితులు భయాందోళనకు గురై కేకలు వేశారు.

సమాచారం అందుకున్న వెంటనే వసాయి-విరార్ మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు , సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. దాదాపు ఆరు గంటల పాటు కష్టపడి, క్రేన్లు, ఎత్తైన నిచ్చెనల సహాయంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. భవనం నుంచి సుమారు 40 మందికి పైగా బాధితులను సురక్షితంగా బయటకు తరలించారు. అయితే, దట్టమైన పొగ కారణంగా గాలి ఆడక, మంటల్లో తీవ్రంగా గాయపడి 60 ఏళ్లకు పైబడిన ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఏడుగురిని, పొగవల్ల ఊపిరి ఆడక అస్వస్థతకు గురైన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని వసాయి-విరార్ మున్సిపల్ అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>