కలం, మునుగోడు : యాసంగి సీజన్‌లో వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని మునుగోడు (Munugude) మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్ రైతులకు సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది యాసంగిలో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవాలని ఆయన తెలిపారు.
మంగళవారం తుమ్మలపల్లి, కస్తాల గ్రామాల్లో ఇటీవల దెబ్బతిన్న పత్తి పంటలను వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ,శనగ, జొన్న, పెసర, మొక్కజొన్న, మినుము, వేరుశనగ వంటి ఆరుతడి పంటలను సాగు చేయడం ద్వారా నీటిని ఆదా చేయడంతో పాటు రైతులు మంచి దిగుబడులు పొందవచ్చన్నారు. భూసారానికి అనుగుణంగా పంటల ఎంపిక చేసుకుని, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని కోరారు.
పత్తి పంట నష్టంపై రైతుల నుంచి వివరాలు సేకరించి, పంటల పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. రైతులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు నాగార్జున, మహేష్, తుమ్మలపల్లి సర్పంచ్ బోయపల్లి రాజేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

