కలం, వెబ్ డెస్క్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఎటుచూసినా ఎండిపోయిన పంట పొలాలు కనిపిస్తున్నాయి. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు. అయితే ఎల్‌నినో ఒకవైపు తీవ్ర నష్టం కలిగిస్తుంటే.. మరోవైపు కొంతమంది రైతులకు కాసులు కురిపిస్తోంది. కరువు కారణంగా చాలామంది రైతులు ఈ ఏడాది వరి సాగుకు (Paddy Prices) దూరమయ్యారు. కొద్దిమంది మాత్రమే ధైర్యం చేసి వరిసాగు చేస్తున్నారు. అయితే తీవ్ర కరువు నేపథ్యంలో రాబోయే రోజుల్లో వరి కోరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఇదే అవకాశంగా మలుచుకున్న దళారులు, వ్యాపారులు ఆయా రైతులతో లాబీయింగ్ చేస్తూ, ముందే పంట దిగుబడి దక్కించుకునేందుకు పొలాల్లో వాలిపోతున్నారు.
తెలంగాణ పల్లెల్లోకి మహారాష్ట్ర వ్యాపారులు వచ్చి, కోతకు సిద్ధం కాని పంటలకు సైతం ముందుగానే ధరలు నిర్ణయిస్తూ అడ్వాన్సులు ఇస్తున్నారు. క్వింటాల్ వడ్లకు (Paddy Prices) రూ.4,000 నుంచి రూ.4,600 వరకు ఆఫర్లు ఇస్తూ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ మద్దతు ధరతో పోలిస్తే ఇవి భారీగా ఎక్కువ. మరోవైపు బియ్యం ధరలు ఇప్పటికే క్వింటాల్‌కు రూ.6,000 నుంచి రూ.8,500 వరకు పలుకుతున్నాయి. రానున్న రోజుల్లో పంటల దిగుబడి తగ్గితే బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

