కలం, వెబ్ డెస్క్ : ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి కాటా (IAS Amrapali) క్యాడర్ కేటాయింపునకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ రేణుక యారాలతో కూడిన ధర్మాసనం కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (DoPT) దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను విచారించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తన తుది తీర్పును రిజర్వ్ చేసింది.
కాగా, 2010 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలిని తెలంగాణ క్యాడర్‌కు కేటాయిస్తూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) 2025 జూన్ 24న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ క్యాట్ ఉత్తర్వులను సవాలు చేస్తూ DoPT హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్ ఆదేశాల అమలును నిలిపివేయాలని కోరడంతో, గతంలోనే హైకోర్టు ఆ ఉత్తర్వులపై స్టే విధించింది. 2014 నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఆమ్రపాలి ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించబడ్డారు.
కానీ ఆ తర్వాత DoPT ఆమె విజ్ఞప్తిని తిరస్కరించడంతో ఆమె క్యాట్‌ను ఆశ్రయించడం, అనంతర పరిణామాలతో ఈ వివాదం కొనసాగుతోంది. ఆమ్రపాలికి ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇటీవల ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగించింది. అయినప్పటికీ హైకోర్టు ఇవ్వబోయే తుది తీర్పు ఆధారంగా ఆమె క్యాడర్ కేటాయింపుపై స్పష్టత రానుంది.

