కలం, మహబూబ్ నగర్ బ్యూరో : వెట్టిచాకిరీ నిర్మూలన, కార్మికుల హక్కుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ‘స్వేచ్ఛా రథం’ (swechha ratham) ప్రచార వాహనాన్ని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వెట్టిచాకిరీకి గురవుతున్న కార్మికులను గుర్తించి, వారికి విముక్తి కల్పించడంతో పాటు తగిన పునరావాసం అందించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వ్యవసాయం, ఇటుక బట్టీలు, ఆక్వాకల్చర్, గనులు, క్వారీల వంటి అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితులను పరిశీలిస్తూ, వెట్టిచాకిరీ బాధితులను గుర్తించడంలో సంబంధిత శాఖల అధికారులు చురుగ్గా వ్యవహరించాలని పేర్కొన్నారు. ‘స్వేచ్ఛా రథం’ జిల్లావ్యాప్తంగా పర్యటిస్తూ వెట్టిచాకిరీ నిర్మూలన, కార్మికుల హక్కులు, కార్మికులపై జరిగే దోపిడీని అరికట్టే మార్గాలపై ప్రజలకు అవగాహన కల్పించనుంది. సమాచార, విద్య, ప్రచార సామగ్రి ద్వారా కార్మికులకు చట్టపరమైన హక్కులు, ప్రభుత్వ రక్షణ వ్యవస్థలపై చైతన్యం కల్పించనున్నారు.
వెట్టిచాకిరీ లేదా కార్మికుల దోపిడీకి సంబంధించిన సమాచారం అందించేందుకు, సహాయం పొందేందుకు టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 080-69434343 ను సంప్రదించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఈ ప్రచార కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సాయి శివానీ,కార్మిక శాఖ ఇంచార్జి అసిస్టెంట్ కమిషనర్ మహమ్మద్ అల్తాఫ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి జరీనా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

