రేవంత్ నీళ్లు విడిచిపెడితే.. చంద్రబాబు ఒడిసిపట్టాడు: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి లిక్కర్ మీద ఉన్న ధ్యాస సాగునీరు, తాగునీరు నీళ్ళు ఇవ్వడం మీద లేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) దుయ్యబట్టారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలను సంబంధించిన సీరియస్ అంశంపై రైతులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలు ఆడుతుందని విమర్శించారు. రాష్ట్ర రైతాంగం ఇన్ని ఇబ్బందులు పడుతుంటే.. రేవంత్ రెడ్డి, మంత్రులు గోవా, ఢిల్లీ అని ట్రిప్పులు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎల్‌నినో పరిస్థితులపై సీఎం రేవంత్.. మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ఉంది, లేదు అనుకుంటూ చిన్నపిల్లల ఆటలు ఆడుతున్నారని విమర్శించారు. ఇదేనా రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి  ఉన్న బాధ్యత? అని నిలదీశారు.

వర్షాలకు ఎగువనుంచి నీళ్ళు వస్తున్నా వాటిని ఎత్తకుండా కాంగ్రెస్ కరువు తెచ్చిందని దుయ్యబట్టారు. సింగరేణిలో బొగ్గున్నా కరెంట్ ఉత్పత్తి చేయలేదన్నారు. సింగూరు ప్రాజెక్ట్ లో ఉన్న రెండు టీఎంసీల నీళ్లను లిక్కర్ ఫ్యాక్టరీలకు సప్లై చేస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో తాగునీటి కష్టాలు వస్తే.. తదుపరి పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు.

ఇప్పటికే ఐఐటీ హైదరాబాద్, బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్‌కు నీళ్లు నిలిపివేశారని అన్నారు. కానీ లిక్కర్ కంపెనీలకు మాత్రం నోటీసులు లేవని ఎద్దేవా చేశారు. అన్ని మోటార్లు నడిపి ఉంటే సాగునీటికి తిప్పలు ఉండేవి కాదని అన్నారు. రేవంత్ రెడ్డి నీళ్ళు విడిచిపెడితే.. చంద్రబాబు ఒడిసి పెట్టాడని ఎద్దేవా చేశారు. “కృష్ణా నదిలో రేవంత్ రెడ్డి నీళ్ళెందుకు ఎత్తుతలేడు? నీ గురువుకు గురుదక్షిణ చెల్లిస్తున్నావా రేవంత్ రెడ్డి?” అని ప్రశ్నించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>