కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. గతేడాది డిసెంబరు రెండో వారంలో నిర్వహించిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల (TSLPRB APP) భర్తీకి నిర్వహించిన పరీక్షల ఫలితాలను వెల్లడించింది. ఈ నెల 17 నుంచి సర్టిఫెకెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ మొదలు కానున్నదని బోర్డు సోమవారం ప్రకటించింది.
కాగా, గతేడాది ఆగస్టు 15న ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. డిసెంబరులో పరీక్షలు పూర్తయ్యాయి. రెండు పేపర్లుగా జరిగిన ఈ పరీక్షల ‘ఫైనల్ కీ’ తో పాటు అర్హులైన అభ్యర్థుల జాబితాను కూడా బోర్డు విడుదల చేసింది. బోర్డు ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ వివరాల ద్వారా అధికారిక వెబ్‌సైట్ (www.tgprb.in) నుండి ఫలితాలను తెలుసుకోవచ్చని, అలాగే ‘సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంటిమేషన్ లెటర్’ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సర్టిఫికేట్ల వెరిఫికేషన్ వివరాలు
ఈ పరీక్షల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు హాజరుకావాల్సిన సమయం, వేదిక తదితర వివరాలను వారి ఇంటిమేషన్ లెటర్‌లోనే స్పష్టంగా పొందుపరిచారు. వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు నేరుగా తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా వెంట తీసుకురావాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్దేశిత సమయానికి హాజరుకాకపోతే, సదరు అభ్యర్థికి ఉద్యోగంపై ఆసక్తి లేనట్లుగా పరిగణించి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడం జరుగుతుందని బోర్డు స్పష్టం చేసింది.
వెంట తీసుకెళ్లాల్సిన ప్రధాన సర్టిఫికెట్లు ఇవే
హాజరయ్యే అభ్యర్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ ప్రింటౌట్, రాత పరీక్ష ఫలితాల షీట్, ఇంటిమేషన్ లెటర్, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి/పదో తరగతి సర్టిఫికేట్, డిగ్రీ మరియు ఎల్‌ఎల్‌బీ/బీఎల్ విద్యార్హత పత్రాలు, బార్ కౌన్సిల్ ఎన్‌రోల్‌మెంట్ సర్టిఫికెట్, మరియు క్రిమినల్ కోర్టులలో కనీసం 3 సంవత్సరాల లాయర్‌గా ప్రాక్టీస్ చేసిన సర్టిఫికెట్ తీసుకెళ్లాలి. వీటితో పాటు 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు (లేదా ఎమ్మార్వో నివాస ధృవీకరణ పత్రం), తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన తాజా క్యాస్ట్ సర్టిఫికెట్, బీసీ అభ్యర్థులు 2025 ఏప్రిల్ 1 తర్వాత పొందిన నాన్-క్రీమీ లేయర్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు, అలాగే వర్తించే వారి కోసం దివ్యాంగులు, క్రీడాకారులు, ఎన్‌సీసీ, సైనిక లేదా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి సడలింపు ధృవీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ లేదా సాంకేతిక సమస్యలు ఉన్నట్లయితే దరఖాస్తులో నమోదైన ఈ-మెయిల్ నుండి support@tslprb.in కి మెయిల్ చేయవచ్చని లేదా 040-41895151 నంబర్‌ను సంప్రదించవచ్చని బోర్డు తెలిపింది.

