కలం, వెబ్ డెస్క్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు (Nagarjuna Sagar Left Canal ) నీటిని విడుదల చేస్తూ నాగార్జునసాగర్ ప్రాజెక్టు (NSP) అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తొలుత 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, అనంతరం ప్రవాహాన్ని 6,000 క్యూసెక్కులకు పెంచనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయంతో సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతుల్లో కొంత ఆశ చిగురించింది. కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఎడమ కాలువకు నీటి విడుదల ప్రాధాన్యం సంతరించుకుంది.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) అనుమతి లేకుండానే ఏపీ అధికారులు కుడి కాలువకు నీటిని విడుదల చేసిన నేపథ్యంలో, తెలంగాణ అధికారులు ఎడమ కాలువకు నీటిని విడుదల చేసినట్లు సమాచారం. కాలువ ద్వారా నీరు అందుబాటులోకి రావడంతో పంటలకు కొంతమేరైనా సాగునీటి సదుపాయం లభిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో నీటి లభ్యతపై ఆధారపడి ఉంటుంది.
సాగునీటి కోసం రైతుల ఎదురుచూపులు
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రాజెక్టులను నింపి పంటలకు నీరు అందించాలని రైతులు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల జూరాల ప్రాంతంలో సాగునీటి కోసం రైతులు ఉద్యమించగా, వారిలో 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల రైతుల్లో చర్చనీయాంశంగా మారింది. సాగుకు అవసరమైన నీటిని నిరంతరాయంగా అందించాలని అన్నదాతలు కోరుతున్నారు.

