షాకింగ్ రిపోర్ట్.. మరో 75 ఏండ్లలో మానవాళి ఖేల్ ఖతమ్?

కలం, నేషనల్ డెస్క్: అణుయుద్ధం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) దుర్వినియోగం, భయంకరమైన జీవ ఆయుధాల తయారీ వల్ల 2100 సంవత్సరం నాటికి మానవాళి పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉందని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్య జర్నల్ ‘ది లాన్సెట్’ (The Lancet Report) హెచ్చరించింది. ‘లాన్సెట్ కమిషన్ ఆన్ 21 సెంచరీ గ్లోబల్ థ్రెట్స్ టు హెల్త్’ నివేదికలో ఈ దిగ్భ్రాంతికర విషయాన్ని వెల్లడించింది. రాబోయే 75 ఏళ్లలో మానవ ఆరోగ్యానికి, మనుగడకు తీవ్ర నష్టం కలిగించే 17 ప్రధాన ముప్పులను 35 మంది అంతర్జాతీయ నిపుణులు గుర్తించారు.

ఏఐతో బయో వెపన్స్​ ముప్పు

సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న ఏఐ దుర్వినియోగంపై ఈ నివేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కొంతమంది దుర్మార్గులు లేదా ఉగ్రవాద శక్తులు ఏఐ సాంకేతికతను ఉపయోగించి అత్యంత ప్రమాదకరమైన జీవ ఆయుధాలను తయారు చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఇవి గనుక బయటకు వస్తే లక్షలాది మంది ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోవడమే కాకుండా, మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని స్పష్టం చేశారు.

అణుయుద్ధంతో తీవ్ర కరువు

ఒకవేళ ప్రపంచంలో అణుయుద్ధం గనుక సంభవిస్తే, దాని వల్ల వెలువడే ప్రమాదకరమైన రేడియోధార్మిక కణాలు, దట్టమైన పొగ వాతావరణం పైపొరల్లోకి చేరుకుంటాయి. ఇది సూర్యకాంతి భూమిని చేరకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా పంటల ఉత్పత్తి పూర్తిగా దెబ్బతిని, తీవ్రమైన కరవు ఏర్పడుతుందని, ఇది మానవాళి అంతానికి దారితీస్తుందని నివేదిక ది లాన్సెట్’ హెచ్చరించింది.

మరో 15 ప్రధాన సవాళ్లు

మానవాళి అంతరించిపోయే ప్రమాదాలతో పాటు ఆరోగ్యాన్ని కుంగదీసే మరో 15 సవాళ్లను కూడా ఈ నివేదికలో నిపుణులు పొందుపరిచారు. వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం, స్థూలకాయం, మానసిక ఆరోగ్య సమస్యలు, పేద దేశాలకు అంతర్జాతీయ ఆరోగ్య సాయం తగ్గడం వంటివి ఇందులో ఉన్నాయి. భూతాపాన్ని 1.8 డిగ్రీల సెల్సియస్​​‌కు పరిమితం చేయగలిగితే 1.89 బిలియన్ల ఆరోగ్యకరమైన జీవిత కాల సంవత్సరాలను కాపాడుకోవచ్చని నిపుణులు సూచించారు. ప్రపంచ దేశాల అధినేతలు ఇప్పటికైనా స్పందించి, తగిన నిధులు కేటాయించి ఈ ముప్పులను ముందే ఊహించి, నివారించడానికి కలిసికట్టుగా చర్యలు చేపట్టాలని నివేదిక కోరింది. జర్మనీలోని బెర్లిన్​​లో త్వరలో జరగనున్న ‘వరల్డ్ హెల్త్ సమ్మిట్’లో ఈ పూర్తి నివేదికను అధికారికంగా సమర్పించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>