కలం, తెలంగాణ బ్యూరో: రానున్న రోజుల్లో తెలంగాణలో కరెంట్ సంక్షోభం (Telangana Power Cuts) పొంచి ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హెచ్చరించారు. ‘‘మార్కెట్లో కొందామన్న కరెంటు దొరకడం లేదు.. పొదుపుగా వాడుకోవాలి. విద్యుత్ ఆధారిత పనులను తాత్కాలికంగా వాయిదా వేసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి” అని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో కరెంట్ కోతలు తప్పవని హింట్ ఇచ్చారు.
ప్రభుత్వాన్ని సమస్యలు చుట్టుముట్టాయి. ఇప్పటికే ఉద్యోగుల డీఏలు, రిటైర్మెంట్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, సంక్షేమ పథకాల అమలు.. వీటికి అవసరమైన ఆర్థిక చిక్కులు వెంటాడుతున్నాయి. తాజాగా గత ప్రభుత్వం నాటి విద్యుత్ ట్రూ-అప్ ఛార్జీల మోత అదనంగా తోడైంది. వీటి నుంచి బయటపడే ఆల్టర్నేట్ చర్యలు రూపుదిద్దుకోకముందే కరెంట్ కోతల రూపంలో సరికొత్త సంక్షోభం సమీపిస్తున్నది. త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఖైరతాబాద్ ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ మున్సిపల్ ఎలక్షన్స్, ఆ తర్వాత పరిషత్ ఎన్నికలు.. ఇలా ఒకదాని తర్వాత మరొకటి రానున్న పరిస్థితుల్లో ప్రజల అసంతృప్తి, ఆగ్రహం ఏ రూపం తీసుకుంటుందన్న ఆందోళన అధికార పార్టీ నేతల్లో నెలకొన్నది.
కరెంట్ కోతలు అనివార్యమైతే ప్రజల నుంచి ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎల్ నినో కారణంగా ఇప్పటికే రైతులకు సాగునీరు అందడం లేదు. బోరుబావుల నుంచి మోటార్ల ద్వారా వాడుకోవాలనుకుంటే విద్యుత్ సరఫరా సమస్యలు ఇబ్బందికరంగా మారాయి. చేతికొచ్చే పంటలు సాగునీరు అందని కారణంగా ఎండిపోతున్నాయి. రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. దీనికి తోడు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ ఎల్ నినో కంటిన్యూ అవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తుండడంతో రబీ సీజన్‌కు ‘క్రాప్ హాలిడే’ తప్పదేమోననే అనుమానాలు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో కరెంట్ కోతలు మొదలైతే ప్రజల్లో ఆగ్రహం ఏ స్థాయికి చేరుతుందో అంచనా వేయడం కాంగ్రెస్ నేతలకు కష్టంగా మారింది. ఒకేసారి సాగునీరు, తాగునీరు, కరెంట్, ఆర్థిక సమస్యలు.. ఇలాంటివన్నీ చుట్టుముట్టడంతో వీటి నుంచి బయటపడడం, ప్రజల్లో వ్యతిరేకతను ఎదుర్కోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి సవాల్‌గా మారింది. ఇది ప్రతిపక్ష బీఆర్ఎస్కు రాజకీయ అస్త్రంగా మారకుండా చూసుకోవడం తక్షణ కర్తవ్యంగా మారింది.
బీఆర్ఎస్కు రాజకీయ అస్త్రం
– “కాంగ్రెస్ అంటేనే కరెంట్ కోతలు.. మళ్లీ ఇన్వర్టర్లు, జెనరేటర్లు తప్పవు.. లోవోల్టేజీ సమస్యలు సరేసరి..” అంటూ 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ కామెంట్ చేశారు.
– ఇంతకాలం రైతుల సమస్యలు, యూరియా సరఫరా, ధాన్యం సేకరణ, రైతు భరోసా, జాబ్ నోటిఫికేషన్లు, ఆరు గ్యారంటీల అమలు.. ఇలాంటి అంశాలు ఎన్ని టేకప్ చేసినా ప్రజల నుంచి ఆశించిన మద్దతు లభించలేదనే అసంతృప్తి బీఆర్ఎస్లో ఉన్నది.
– తాజాగా ట్రూ-అప్ ఛార్జీల పేరుతో వినియోగదారులపై నవంబర్ నుంచి దాదాపు రాబోయే రెండున్నరేండ్ల పాటు కరెంట్ ఛార్జీల భారం పడనున్నది. ఇదే సమయంలో కరెంటు కోతలు కూడా తప్పేలా లేవు. దీంతో ఈ అంశాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నది.
– ఇప్పటికే వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో సబ్ స్టేషన్లలో తనిఖీలు చేస్తూ 8 గంటలు కూడా ఇవ్వడం లేదంటూ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ తూర్పారబడుతున్నది. ఇక అధికారికంగా కరెంట్ కోతలు మొదలైతే ఆ అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలనుకుంటున్నది.
సీఎం వ్యూహమే కీలకం
బీఆర్ఎస్కు ఈసారి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వివిధ సెక్షన్ల ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి బలమైన వ్యతిరేకతగా మారకుండా, అది బీఆర్ఎస్కు అనుకూలంగా మారకుండా ఉండేందుకు సీఎం ఎలాంటి వ్యూహం పన్నుతారన్నది కాంగ్రెస్ లీడర్లకు ఆసక్తికరంగా మారింది. పదేండ్ల కాలంలో ఎన్నడూ రెప్పపాటు కరెంట్ పోకుండా కేసీఆర్ చాకచక్యంగా వ్యవహరించారని బీఆర్ఎస్ ఏకరువు పెట్టే అవకాశమున్నది. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో మళ్లీ చీకటి రోజులు వచ్చాయంటూ ప్రచారం చేసే చాన్స్ ఉన్నది. ఎల్ నినో తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనది కాదని, పలు రాష్ట్రాల్లోనూ దీని ప్రభావం ఉన్నదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రే స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని జాతీయ సమస్యగా, ప్రకృతి విపత్తుగా ప్రజల్లో కాంగ్రెస్ ఏ మేరకు అవగాహన కలిగిస్తుందన్నది కీలకంగా మారింది. బీఆర్ఎస్ రాజకీయ అడ్వాంటేజ్‌కు బ్రేకులు వేసేలా కాంగ్రెస్ తీసుకునే స్టాండ్ రాబోయే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నది. ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యూహం రచిస్తారన్నది కీలకంగా మారింది.

