కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ (LMD Police Station)లో పోలీసుల అదుపులో ఉన్న ఒక యువకుడు పోలీస్ స్టేషన్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీకి చెందిన కిన్నెర అజయ్, మరో ముగ్గురిని వరుస దొంగతనాల కేసులో నాలుగు రోజుల కిందట ఎల్ఎండీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజులవుతున్నా అరెస్టును చూపించకుండా స్టేషన్లోనే ఉంచి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని అజయ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
పోలీసుల టార్చర్ తట్టుకోలేకనే..
పోలీసుల తీవ్ర వేధింపులు, థర్డ్ డిగ్రీ టార్చర్ భరించలేకపోయిన అజయ్ ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ భవనంపై నుంచి కిందకు దూకినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అజయ్‌కు తీవ్ర గాయాలు కావడంతో తక్షణమే చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోలీసుల అక్రమ వేధింపుల వలనే తమ కొడుకు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడని బాధితుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించి, బాధ్యులైన పోలీసు అధికారులపై చట్టపరమైన తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీస్ శాఖ నుంచి వివరణ రావాల్సి ఉంది.

