కలం, వెబ్ డెస్క్: ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత ( Kalvakuntla Kavitha) విద్యార్థినిలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఆదివారం సాయంత్రం ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. యూనివర్సిటీని విద్యుద్దీప కాంతులతో అలంకరించారు. వేలాది మంది విద్యార్థులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ జాగృతితో ఏటా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కవిత.. తెలంగాణ రక్షణ సేన పార్టీ పగ్గాలు చేపట్టి అధ్యక్షురాలిగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మను ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ వేదికగా జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. ఓయూ విద్యార్థులు, మహిళలతో కలిసి ఇక్కడ బతుకమ్మ ఆడటం ఎప్పటికీ మర్చిపోలేనిదని కొనియాడారు. బతుకమ్మ వేడుకలను దిగ్విజయం చేసేందుకు కృషి చేసిన విద్యార్థి సోదర, సోదరీమణులకు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.
బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా కల్వకుంట్ల కవిత పలుచోట్ల బతుకమ్మ వేడుకల్లో పాల్గొనున్నారు. తొలిరోజు ఉస్మానియా యూనివర్సిటీలో వేడుకలు జరుగగా.. ఆగస్టు12 సోమవారం ఉదయం 11:00 గంటలకు బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలోని వేడుకల్లో పాల్గొంటారు. 14న సాయంత్రం 5:00 గంటలకు మియాపూర్ లో మహిళా నాయకులతో కలిసి బతుకమ్మ ఆడనున్నారు. అదేరోజు సాయంత్రం 6:30 గంటలకు సెంట్రల్ యూనివర్సిటీ బతుకమ్మ వేడుకల్లో పాల్గొననున్నారు. 17 అక్టోబర్ సాయంత్రం 6:00 గంటలకు యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో, 18న సాయంత్రం 6:00 గంటలకు చింతల్ బస్తీ రామ్ లీలా మైదానంలో నిర్వహించే సద్దుల బతుకమ్మ సంబురాల్లో పాల్గొంటారు.

