అశ్వారావుపేటలో క్రీడా సంబరాలు.. హోరాహోరీగా క్రీడలు

కలం, సత్తుపల్లి: అశ్వారావుపేట (Aswaraopeta) నియోజకవర్గ కేంద్రంలో నిర్వహిస్తున్న అండర్‌-20 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు రెండో రోజు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి క్రీడాకారులు, కోచ్‌లు తరలిరావడంతో స్థానిక స్టేడియం సందడిగా మారింది. ఉదయం నుంచే హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లు క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. క్రీడాకారుల కేరింతలు, ప్రేక్షకుల ఉత్సాహంతో క్రీడా ప్రాంగణం కోలాహలంగా కనిపించింది. పోటీలను స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యవేక్షిస్తూ క్రీడాకారులను ప్రోత్సహించారు. మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లతో మాట్లాడి, వారి ప్రతిభను అభినందించారు. క్రీడల్లో పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర సాధనతో ఉన్నత స్థాయికి ఎదగాలని యువ క్రీడాకారులకు సూచించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

క్రీడాకారుల హర్షం

వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు, కోచ్‌లకు కల్పించిన వసతి, భోజనం, ఇతర మౌలిక సదుపాయాలపై సంతృప్తి వ్యక్తమైంది. పోటీలు సజావుగా సాగేందుకు నిర్వాహకులు చేసిన ఏర్పాట్లను అభినందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, పోలీసు సిబ్బంది, ఉపాధ్యాయులు, మున్సిపల్‌ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, మైదానంలో క్రమశిక్షణ, పరిసరాల పరిశుభ్రతతో పాటు ఇతర ఏర్పాట్లలో సంబంధిత సిబ్బంది కీలక పాత్ర పోషించారు.

అలరించిన క్యాంప్‌ఫైర్‌

రెండో రోజు పోటీలు ముగిసిన అనంతరం రాత్రి క్రీడాకారుల కోసం నిర్వాహకులు క్యాంప్‌ఫైర్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మంటల చుట్టూ వివిధ జిల్లాల నుంచి వచ్చిన యువ క్రీడాకారులు పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. పోటీల ఒత్తిడిని మరచి పరస్పరం పరిచయాలు పెంచుకుంటూ, స్నేహభావాన్ని చాటుకున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల యువత ఒకే వేదికపై కలుసుకోవడం, క్రీడా ప్రతిభతో పాటు స్నేహసంబంధాలను పంచుకోవడం ఈ పోటీల ప్రత్యేకతగా నిలిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>