కలం, కరీంనగర్: నగరంలోని పద్మనగర్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD Temple) ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఆలయ నిర్మాణ పనులను ఈ నెల 17న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (MLA Gangula Kamalakar) తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన టీటీడీ అధికారులతో కలిసి ఆలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. నిర్మాణ పనుల ప్రారంభానికి సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లు, ఆలయ నమూనాలు, ఇతర అంశాలపై అధికారులతో చర్చించారు.
కేసీఆర్ సహకారంతో అనుమతులు
కరీంనగర్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పంతో గతంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి టీటీడీ అనుమతులు పొందినట్లు గంగుల కమలాకర్ వివరించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కవిరి భాస్కర్‌రావు, వినోద్‌కుమార్, దామోదర్‌రావులతో కలిసి తిరుమలకు వెళ్లి టీటీడీ అధికారులతో చర్చలు జరిపినట్లు గుర్తు చేశారు. వారి సహకారంతో ఆలయ నిర్మాణానికి అనుమతులు సాధించినట్లు పేర్కొన్నారు.
టీటీడీ పేరిట భూమి రిజిస్ట్రేషన్
కరీంనగర్ నగరంలోని పద్మనగర్‌లో ఆలయ నిర్మాణం కోసం పది ఎకరాల భూమిని టీటీడీ పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు గంగుల కమలాకర్ తెలిపారు. భూమికి సంబంధించి వివిధ దశల్లో ఎదురైన అడ్డంకులను అధిగమించి ఆలయ నిర్మాణానికి అవసరమైన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లినట్లు వివరించారు. 2023 మే 31న ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించామని, ఆ సందర్భంగా హోమాలు, ప్రత్యేక పూజలు చేపట్టినట్లు చెప్పారు. ఆలయ నిర్మాణం కోసం మూలవిరాట్టుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసినట్లు వెల్లడించారు.
ఎన్నికలతో నిలిచిన పనులు
భూమిపూజ అనంతరం ఆలయ నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ చేపట్టినప్పటికీ, ఎన్నికల నేపథ్యంలో పనులు ఆశించిన వేగంతో ముందుకు సాగలేదని గంగుల కమలాకర్ వివరించినట్లు తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తవుతున్నాయని పేర్కొన్నారు. అక్టోబర్ 17న మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం తొమ్మిది గంటలలోపు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు.
తిరుమలను తలపించేలా రూపకల్పన
పద్మనగర్‌లో నిర్మించనున్న ఆలయానికి సంబంధించిన నమూనాలు ఆకర్షణీయంగా రూపొందించినట్లు గంగుల కమలాకర్ తెలిపారు. తిరుమల ఆలయాన్ని తలపించేలా ప్రధాన ద్వారం ఉండటంతో పాటు గర్భాలయం, అర్థమండపం, ముఖమండపం, గరుడాళ్వార్ తదితర నిర్మాణాలతో ఆలయాన్ని తీర్చిదిద్దనున్నట్లు వివరించారు. సంప్రదాయబద్ధమైన నిర్మాణ శైలిలో స్వామివారి ఆలయాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రం
నగరంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మాణం చేపట్టడం సంతోషకరమైన విషయమని గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆలయ నిర్మాణం పూర్తయితే కరీంనగర్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల భక్తులకు స్వామివారిని దర్శించుకునే అవకాశం మరింత చేరువవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఆలయ నిర్మాణ స్థల పరిశీలనలో ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్ల హరి శంకర్, నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు గడ్డి ప్రదీప్ యాదవ్, గుగ్గిళ్ళ జయశ్రీ శ్రీనివాస్, మాజీ కొత్తపెళ్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, మాజీ ఎంపీపీ పిల్లి, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, మాజీ కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, దిండియాల మహేష్, నాంపల్లి శ్రీనివాస్, మాజీ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ కర్ర సూర్య శేఖర్, మాజీ సుడా డైరెక్టర్ నేతి రవివర్మ, కరీంనగర్ జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిట్టిమల్ల శ్రీనివాస్, టీటీడీ ఏఈ నాగరాజు, స్థానిక కాంట్రాక్టర్, మధుసూదన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

