కలం, స్పోర్ట్స్: డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (Steve Smith) అరుదైన ఘనత సాధించారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా నిలిచి, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ రికార్డును అధిగమించారు. మ్యాచ్ మూడో రోజు ఆటలో భాగంగా ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ బెడింగ్‌హామ్ ఇచ్చిన క్యాచ్‌ను స్మిత్ అద్భుతంగా అందుకున్నారు. స్మిత్ తన ఎడమ వైపునకు డైవ్ చేస్తూ ఈ క్యాచ్‌ను పూర్తి చేశారు. ఈ వికెట్‌తో టెస్టుల్లో ఆయన పట్టిన క్యాచ్‌ల సంఖ్య 221కి చేరింది.
ఇంతకుముందు జో రూట్ 220 క్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు స్మిత్ 221 క్యాచ్‌లతో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకున్నారు. ఈ జాబితాలో రాహుల్ ద్రావిడ్ (210) మూడో స్థానంలో ఉండగా, మహేలా జయవర్ధనే (205), జాక్ కల్లిస్ (200), రికీ పాంటింగ్ (196) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. అంతకుముందు బ్యాటింగ్‌లో స్మిత్ తొలి ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేసి మార్కో జాన్సన్ బౌలింగ్‌లో వెనుదిరిగారు. అయినప్పటికీ, మ్యాట్ రెన్‌షా అద్భుతమైన 190 పరుగుల ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 390 పరుగులు సాధించింది.

