కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా భారీగా అర్హులైన ఓట్లు తొలగించబడుతున్నాయని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆరోపించారు . అయితే ఓటరు సవరణపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్. రామచందర్‌రావు అనడం కరెక్ట్ కాదని వ్యాఖ్యానించారు.
ఈ మేరకు తెలంగాణ బీజేపీ చీఫ్ కు బహిరంగ సవాల్ విసురుతున్నానని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఓటు హక్కు కోల్పోయిన బాధితులను, వారి వద్ద ఉన్న ఆధారాలతో సహా రామచందర్‌రావు ముందుకు తీసుకురావడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీనిపై చర్చించేందుకు రామచందర్‌రావు తేదీ, సమయం నిర్ణయించాలని డిమాండ్ చేశారు.
ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ వర్గాలకు చెందిన ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయని, కేవలం హైదరాబాద్‌లోనే 40 లక్షలు, రాష్ట్రవ్యాప్తంగా సవరణ పేరుతో 70 లక్షల ఓట్లు తీసివేశారని సంచలన గణాంకాలను వెల్లడించారు. ప్రజాస్వామ్యానికి ప్రాణపదమైన ఓటు హక్కు పరిరక్షణ కోసం ఓటర్ల జాబితా రికార్డులను పారదర్శకంగా పరిశీలించాలని, తప్పులు ఉంటే వెంటనే సరిదిద్ది బాధితులకు న్యాయం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల యంత్రాంగాన్ని కోరారు.

