కలం, వెబ్ డెస్క్ : నేపాల్‌లో మరోసారి భారీ జలప్రళయం (Nepal floods) సంభవించింది. గోర్ఖా జిల్లా పరిధిలోని బుధిగండకి నది ఉప్పొంగి ప్రవహించడంతో సల్లెరి బజార్ పూర్తిగా కొట్టుకుపోయింది. కొండచరియలు విరిగిపడి నదీ ప్రవాహాన్ని తాత్కాలికంగా అడ్డుకోవడంతో ఒక్కసారిగా భారీస్థాయిలో నీరు చేరి కట్టలు తెంచుకుని ముందుకు దూసుకొచ్చిందని స్థానికులు భావిస్తున్నారు.
ఇలా నది మార్గానికి అడ్డంకులు ఏర్పడినప్పుడు కొన్ని నిమిషాల్లోనే నీటిమట్టం ప్రమాదకరంగా పెరిగి, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు ఖాళీ చేసేందుకు కూడా సమయం దొరకకుండా విపత్తుగా మారుతుంది. ఇటీవల హిమాలయ పర్వత ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, బలహీనమైన కొండచరియలు విరిగిపడటం, నదుల ఉధృతి వంటి కారణాల వల్ల మారుమూల ప్రాంతాల్లో నదీ తీరాలకు సమీపంలో నివసిస్తున్న ప్రజల జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయి.

