కలం, దేవరకొండ: ఎనిమిదేళ్ల కిరాయి ఇంటి కష్టాలు.. ప్రతినెలా ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఆ దివ్యాంగ దంపతులు నేడు సొంతింట్లో ఆత్మగౌరవంతో జీవనం సాగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు (Indiramma House) నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం గొల్లపల్లి(Gollapalli) గ్రామానికి చెందిన అనంతుల కృష్ణయ్య, సైదమ్మ దంపతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. ఇంటి నిర్మాణం పూర్తికావడంతో ప్రస్తుతం అందులోనే నివసిస్తూ వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణయ్య, సైదమ్మ దంపతులకు వివాహమై పదేళ్లు పూర్తయ్యాయి. ఇద్దరూ దివ్యాంగులు కావడంతో రోజువారీ జీవనంతో పాటు ప్రతి నెలా ఇంటి అద్దె చెల్లించడం వారికి తీవ్ర భారంగా మారింది. సొంత ఇల్లు నిర్మించుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల పథకం’ వారి జీవితాల్లో కొత్త ఆశలు చిగురింపజేసింది. గృహ నిర్మాణం పూర్తికావడంతో కిరాయి కష్టాల నుంచి విముక్తి పొంది ప్రశాంతంగా నివసిస్తున్నారు.
రేషన్ కార్డు నుంచి ఉచిత విద్యుత్ వరకు..
ఇందిరమ్మ ఇంటితో పాటు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు తమకు ఊరటనిచ్చాయని ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు మంజూరు చేయడంతో పాటు సన్నబియ్యం అందిస్తుండటంతో నిత్యావసర ఖర్చులు తగ్గి కుటుంబానికి ఆహార భద్రత చేకూరిందని తెలిపారు. గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ అందడం వల్ల విద్యుత్ బిల్లుల భారం తప్పిందని, ఆదా అయిన డబ్బును ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నామని చెప్పారు.
ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం మహిళల ఆర్థిక సాధికారతకు ఎంతో దోహదపడుతోందని పేర్కొన్నారు. దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ చొరవతో అర్హులైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందుతున్నాయని కొనియాడారు. తమలాంటి దివ్యాంగ, నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్‌కు కృష్ణయ్య, సైదమ్మ దంపతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

