కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లాలో మొక్కజొన్న రైతులకు (Maize Farmers) ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలోని నిర్మల్, సారంగాపూర్, మామడ, లక్ష్మణచందా, కడెం, ఖానాపూర్, దస్తూరాబాద్, దిలావర్‌పూర్, పెంబి తదితర మండలాల్లో సుమారు 30 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. పంట చేతికి వచ్చినప్పటికీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మద్దతు ధరకు మించి ధర లభిస్తుందని ఆశించిన రైతులకు మార్కెట్‌లో ఆశించిన ధర దక్కడం లేదు.
ప్రభుత్వం మొక్కజొన్నకు క్వింటాలుకు రూ.2,410 మద్దతు ధర ప్రకటించింది. అయితే, 15 రోజుల క్రితం క్వింటాలుకు సుమారు రూ.2,700 పలికిన ధర ప్రస్తుతం రూ.300 మేర తగ్గిందని రైతులు చెబుతున్నారు. వర్షాభావ పరిస్థితులు, దిగుబడుల తగ్గుదల నేపథ్యంలో మొక్కజొన్నకు డిమాండ్ ఉన్నప్పటికీ ధరలు పెరగకపోవడం తమకు నష్టం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేటు వ్యాపారుల వద్దే విక్రయాలు..
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తమ పంటను ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. పంట నాణ్యత పేరుతో ధర తగ్గించడంతోపాటు వివిధ రకాల కోతలు విధిస్తూ తమకు నష్టం కలిగిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, ఇతర పెట్టుబడి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఆశించిన ధర లభించకపోతే నష్టాలు తప్పవని ఆందోళన చెందుతున్నారు.
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి..
మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు మద్దతు ధర లభించడంతోపాటు ప్రైవేటు వ్యాపారులు కూడా మెరుగైన ధర చెల్లించే అవకాశం ఉంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో మద్దతు ధరకు మించి ధర లభించే అవకాశం ఉన్నప్పటికీ, కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ఆ ప్రయోజనం పొందలేకపోతున్నామని పేర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

