కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో (Madhapur Land Fraud) తక్కువ ధరకు భారీ భూమి ఇప్పిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యను కేటుగాళ్లు టోకరా వేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మాదాపూర్‌లో ఏకంగా 5.5 ఎకరాల భూమిని మార్కెట్ ధరకంటే తక్కువకే విక్రయిస్తామని నమ్మబలికిన గోపాల్ అనే వ్యక్తి, అతని కుమారుడు రామచంద్రయ్యను సంప్రదించారు. దీనిని నమ్మిన ఎమ్మెల్సీ ముందస్తు చెల్లింపుగా వారికి రూ. 25 లక్షలు అందజేశారు.
అయితే కొద్ది రోజుల తర్వాత అసలు భూమికి సంబంధించిన సరైన పత్రాలు చూపించమంటూ ఎమ్మెల్సీ ఒత్తిడి తెచ్చేసరికి నిందితులు ముఖం చాటేశారు. దీంతో అనుమానం వచ్చిన రామచంద్రయ్య ఆ భూమికి సంబంధించిన రికార్డులపై ఆరా తీయగా, అసలు విషయం బయటపడింది. ఆ భూమితో సదరు కేటుగాళ్లకు ఎలాంటి సంబంధం లేదని, కేవలం మోసం చేయడానికే తనను టార్గెట్ చేశారని తెలుసుకుని షాక్ అయ్యారు. దీంతో బాధిత ఎమ్మెల్సీ ఫిర్యాదు మేరకు స్పందించిన జూబ్లీహిల్స్ పోలీసులు నిందితులపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు.

