కలం, వెబ్డెస్క్: సీఈసీ రాజీనామాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనలపై బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం దేశ భద్రతను విస్మరిస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi ) ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. విదేశీ గడ్డపై భారత ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించడం నుండి దేశ వ్యతిరేక విధానాల వరకు రాహుల్ గాంధీ ప్రాధాన్యతలు ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉన్నాయన్నారు.
ఒకప్పుడు వ్యతిరేకించిన అంశాలపైనే కాంగ్రెస్ ఇప్పుడు తన వైఖరిని మార్చుకోవడంపై ప్రధాన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ యూటర్న్ తీసుకున్నారన్నారు. విదేశీ శక్తుల ఒత్తిళ్లకు తలొగ్గి దేశ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఏమాత్రం ఒత్తిళ్లకు తలవంచబోదని, జాతీయ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.భారత్ ప్రపంచ దేశాల పెట్టుబడులను, ఆవిష్కరణలను సాదరంగా ఆహ్వానిస్తుందని ధర్మేంద్ర పేర్కొన్నారు. అయితే దేశ చట్టాలను గౌరవించే సంస్థలకే ఇక్కడ చోటు ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి వీడి దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, రాజకీయ ప్రయోజనాల కోసం జాతీయ భద్రతను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకట్టు పెట్టబోమని ఆయన తేల్చి చెప్పారు.

