కరీంనగర్ జిల్లాలో పత్తి కొనుగోళ్లకు సర్వం సిద్ధం

కలం, కరీంనగర్ బ్యూరో: జిల్లాలో 2026 –27 పత్తి మార్కెటింగ్ సీజన్‌లో రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా కొనుగోలు ప్రక్రియ (Karimnagar Cotton Procurement)ను అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేసేందుకు కరీంనగర్ జిల్లా యంత్రాంగం సమగ్ర చర్యలు చేపట్టింది. శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ (డీఎల్సీ) సమావేశంలో వివిధ శాఖల అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. రైతులు తాము కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర పొందాలని, కొనుగోలు కేంద్రాలు, జిన్నింగ్ మిల్లుల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటమే లక్ష్యంగా శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 2.50 లక్షల క్వింటాళ్ల పైగా దిగుబడి వచ్చే అవకాశమున్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న వర్షాభావం కారణంగా విత్తనాలు వాడిపోవడంతో పత్తి రైతులు తీవ్ర ఆందోళన చెందారు. వేసిన విత్తనాలు తిరిగి వేసి తమ ఆశలు కోల్పోయారు. ఉమ్మడి జిల్లాలో వరి తర్వాత అత్యధికంగా పండించే రెండవ పంట పత్తి. ఎల్ నినో ప్రభావంతో పూర్తిగా ఆశలు కోల్పోయారు. ఈసారి దిగుబడి తగ్గే అవకాశమే ఉందని రైతులు వాపోతున్నారు. గతేడాది ముందుగా విత్తడం వల్ల మంచి దిగుబడి వచ్చింది.

రైతు వేదికల ద్వారా విస్తృత అవగాహన..

పత్తి విక్రయాల్లో రైతులకు పూర్తి అవగాహన కల్పించేందుకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు సంయుక్తంగా ప్రణాళిక రూపొందించాయి. కనీస మద్దతు ధర పొందేందుకు పాటించాల్సిన నాణ్యత ప్రమాణాలు, తేమ శాతం ప్రాముఖ్యతను రైతులకు వివరిస్తారు. కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీని నివారించేందుకు ‘కపాస్ కిసాన్ యాప్’ ద్వారా ముందస్తుగా స్లాట్ బుకింగ్ చేసుకునే విధానంపై ఏఈఓలు, మార్కెట్ కమిటీ కార్యదర్శులు రైతు వేదికల వద్ద రైతులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

జిన్నింగ్ మిల్లుల్లో సౌకర్యాల తనిఖీ..

కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై చేసిన అన్ని జిన్నింగ్ మిల్లుల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని అధికారులు ఆదేశించారు. మిల్లుల్లోని తూనిక యంత్రాల (వే బ్రిడ్జిలు) స్టాంపింగ్, క్యాలిబ్రేషన్‌ను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. మిల్లుల్లో అగ్నిమాపక పరికరాల పనితీరును ఫైర్ డిపార్ట్‌మెంట్ తనిఖీ చేస్తుంది. కొనుగోలు ప్రక్రియ సులువుగా సాగేందుకు కంప్యూటర్లు, ప్రింటర్లు, ఆధార్ ఆథెంటికేషన్ పరికరాలను మిల్లు యజమానులు సిద్ధం చేస్తున్నారు.

రవాణా, ట్రాఫిక్ నివారణకు ప్రత్యేక సమన్వయం..

పత్తి విక్రయ సీజన్‌లో రవాణా సమస్యలు తలెత్తకుండా రవాణా శాఖ, పోలీస్ శాఖ, స్థానిక పర్యవేక్షణ కమిటీలు, మార్కెట్ కమిటీలు సమన్వయంతో పనిచేస్తాయి. పత్తి గింజలు, బేళ్ల రవాణా సజావుగా సాగేందుకు త్వరలోనే సంబంధిత శాఖలతో ప్రత్యేక సమన్వయ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. స్థానికంగా వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు పర్యవేక్షణ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయి. సీసీఐ మద్దతు ధరల వివరాల ప్రకారం క్వింటాలు పత్తికి తేమ ఆదారితంగా వివరాలు ప్రకటించారు. 8% (గరిష్ట ధర) రూ. 8,667.00, 9%రూ. 8,580.33, 10% రూ. 8,493.66, 11%రూ. 8,406.99, 12% రూ. 8,320.32గా ప్రకటించారు. 12 శాతం కంటే ఎక్కువ తేమ ఉన్న పత్తిని కొనుగోలు కేంద్రాలలో స్వీకరించరు.

నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకే చెల్లింపులు..

రైతులు తమ ఆధార్ వివరాలను ఏపీఎంసీలలో ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి. కొనుగోలు చేసిన పత్తికి సంబంధించిన నగదు నేరుగా రైతుల ఆధార్ లింక్డ్ బ్యాంక్ ఖాతాల్లోకే క్రెడిట్ అవుతుంది. సందేహాల కోసం సహాయక కేంద్రం నంబరు: 0870-2565077, వాట్సప్ నంబరు: 9440587833 లను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>