పిల్లలమర్రిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన పిల్లలమర్రిని అన్ని ఆధునిక సౌకర్యాలతో ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ పిల్లలమర్రిని సందర్శించి పర్యాటక, అటవీ, మత్స్య, విద్య, పురావస్తు శాఖల ఆధ్వర్యంలో రూ.2.5 కోట్ల తో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి, చేపట్టాల్సిన పనులపై పలు సూచనలు చేశారు. పర్యటనలో భాగంగా ముందుగా పర్యాటక ప్రాంతంలోని ప్రవేశ ద్వారం, టికెట్ కౌంటర్, మరుగుదొడ్లు, ప్రహరీ తదితర అభివృద్ధి పనులను పరిశీలించారు. సందర్శకులకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, పర్యాటక ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అనంతరం సైన్స్ మ్యూజియాన్ని పరిశీలించిన కలెక్టర్, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేలా హైదరాబాద్‌లోని బిర్లా సైన్స్ మ్యూజియం తరహాలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. చిల్డ్రన్స్ పార్కును కూడా ఆకర్షణీయంగా, రంగురంగుల ఆట పరికరాలతో ఆధునికీకరించాలని ఆదేశించారు. పాతబడిన ఆట పరికరాలను తొలగించి, కొత్త పరికరాలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన బడ్జెట్ అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని ప్రదర్శనశాలను సందర్శించిన కలెక్టర్, ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు చారిత్రక ప్రాధాన్యత కలిగిన వస్తువులు, విగ్రహాలను పరిశీలించారు. వాటి చారిత్రక నేపథ్యం, ప్రాధాన్యత తెలిసేలా సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. పాత భవనాల స్థితిగతులను పరిశీలించి, పై కప్పు పెచ్చులు ఊడుతున్న వాటిని గమనించారు. వాటి మరమ్మతులు, పునరుద్ధరణ చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. సైన్స్ మ్యూజియం పరిసరాల్లో చెత్తాచెదారం గడ్డి లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

మర్రిచెట్టు పరిసరాలను పరిశీలించిన కలెక్టర్

పిల్లలమర్రి ప్రసిద్ధ మర్రిచెట్టు పరిసరాలను పరిశీలించిన కలెక్టర్, ప్రాంగణంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, పచ్చదనం పెంపొందించేలా ల్యాండ్‌స్కేపింగ్ చేపట్టాలని సూచించారు. సందర్శకులకు తాగునీరు, చెత్తబుట్టలు వంటి సదుపాయాలు కల్పించాలని, గడ్డి, మొక్కలు పచ్చగా ఉండేలా క్రమం తప్పకుండా నీటిని అందించాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. కేఫ్‌టేరియా ప్రాంతంలోనూ సందర్శకులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

జింకల పార్కును సందర్శించిన కలెక్టర్ అక్కడ ఉన్న జింకల సంఖ్య, వాటికి అందిస్తున్న ఆహారం, తాగునీరు, సంరక్షణ చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సుమారు 85 జింకలు ఉన్నట్లు అధికారులు వివరించారు. జింకల సంరక్షణ, వాటి ప్రాధాన్యతపై అటవీశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

ఆక్వేరియాన్ని పరిశీలించిన కలెక్టర్

మత్స్యశాఖ ఆధ్వర్యంలోని ఆక్వేరియాన్ని పరిశీలించిన కలెక్టర్, సుమారు 27 ఏళ్ల క్రితం నిర్మించిన భవనాన్ని ఆధునికీకరించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ, సంబంధిత ఇంజినీరింగ్ అధికారుల సమన్వయంతో సమగ్ర అభివృద్ధి పను చేపట్టాలని, ఆధునిక ఆక్వేరియంలు, 3డీ గ్రాఫిక్స్, ఆకర్షణీయమైన పెయింటింగ్స్‌తో పాటు సందర్శకులను ఆకట్టుకునేలా ప్రదర్శనలను అభివృద్ధి చేయాలని తెలిపారు. ఈ పనులకు అవసరమైన నిధుల కోసం మత్స్యశాఖ కమిషనర్ ద్వారా ప్రతిపాదనలు సమర్పించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఆక్వేరియం, జంతు ప్రదర్శన ప్రాంతాల్లో వివిధ రకాల జలచరాలు, పాములు, ఇతర జీవుల గురించి విద్యార్థులకు అవగాహన కలిగించేలా సమాచార సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వాటి జీవన విధానం, ప్రత్యేకతలు, పర్యావరణంలో వాటి పాత్రను వివరించే సమాచారాన్ని స్పష్టంగా పొందుపరచాలని సూచించారు.

పిల్లలమర్రిలోని అన్ని పర్యాటక ఆకర్షణలను సమగ్రంగా అభివృద్ధి చేసి, సందర్శకులకు మెరుగైన అనుభూతి కలిగించేలా శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. అవసరమైన పనులకు సంబంధించి అంచనాలు, బడ్జెట్ ప్రతిపాదనలు, కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ (అండర్ ట్రైనీ) సాయి శివాని, DROA నిర్మల, DFOM నవీన్ రెడ్డి, జిల్లా పర్యాటక శాఖ అధికారి జె.రాజశేఖర్ రెడ్డి, జిల్లా మత్స్యశాఖ అధికారి రాధా రోహిణి, పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగలక్ష్మి, విద్యాశాఖ నుండి AMO డి.శ్రీనివాస్, అటవీశాఖ అధికారులు, పర్యాటక శాఖ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>