కలం, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మేగన్ షట్ (Megan Schutt) చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్లో 150 వికెట్ల మైలురాయిని అందుకుంది. బంగ్లాదేశ్ మహిళలతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఈ ఘనత సాధించింది. దీంతో ఈ మైలురాయిని అందుకున్న మూడో ఆస్ట్రేలియా బౌలర్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సిరీస్‌లో తొలి బంతికే షట్ తన సత్తా చాటింది. బంగ్లాదేశ్ ఓపెనర్ ఫర్గానా హక్‌ను పెవిలియన్‌కు పంపింది. బ్యాట్ అంచుకు తగిలిన బంతిని ఫోబ్ లిచ్‌ఫీల్డ్ స్లిప్‌లో అందుకుంది. మూడో ఓవర్లో షర్మిన్ సుల్తానాను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసి 150వ వికెట్‌ను ఖాతాలో వేసుకుంది.
ఈ ఘనతతో ప్రపంచ మహిళల వన్డేల్లో 150 వికెట్లు తీసిన 12వ బౌలర్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా తరఫున క్యాథరిన్ ఫిట్జ్‌పాట్రిక్ 180 వికెట్లతో అగ్రస్థానంలో ఉంది. ఎలీస్ పెర్రీ 166 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడు షట్ కూడా ఈ జాబితాలో చేరింది. ఇక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్లు బంగ్లాదేశ్‌ను కట్టడి చేశారు. అన్నాబెల్ సదర్లాండ్ నాలుగు వికెట్లు పడగొట్టింది. యాష్లీ గార్డ్నర్, తహ్లియా మెక్‌గ్రాత్, జార్జియా వేర్హామ్ తలో వికెట్ తీశారు. బంగ్లాదేశ్ 166 పరుగులకు ఆలౌటైంది. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రీతూ మోనీ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.

