కలం, ఖమ్మం బ్యూరో: కోర్సు మధ్యలో నిలిపివేసిన ఓ విద్యార్థినిని ఫీజులు, పెనాల్టీల పేరిట ప్రైవేట్ నర్సింగ్ కాలేజీ యాజమాన్యం వేధిస్తోంది. ఒరిజినల్ సర్టిఫికేట్లు, టీసీ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోందంటూ బాధితురాలు బుధవారం జిల్లా అధికారులను ఆశ్రయించి తన ఆవేదన వ్యక్తం చేసింది. ఖమ్మం (Khammam) పట్టణానికి చెందిన దాసరి దీపిక వివరాల ప్రకారం.. ఆమె 2021లో ఖమ్మంలోని పులిపాటి ప్రసాద్ జీఎన్ఎమ్ నర్సింగ్ కాలేజీలో చేరారు. మొదటి సంవత్సరం ఫీజును పూర్తిగా చెల్లించినప్పటికీ, ఆర్థిక ఇబ్బందుల వల్ల రెండో సంవత్సరంలో చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది.
అయితే, కోర్సు మానేసినప్పటికీ కాలేజీ యాజమాన్యం 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఒరిజినల్ మార్కుల మెమోలతో పాటు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ (టీసీ) ఇవ్వకుండా నిరాకరిస్తోంది. చదువని 4వ, 5వ సెమిస్టర్ల ఫీజులతోపాటు అదనంగా పెనాల్టీ డబ్బులు కడితేనే సర్టిఫికేట్లు ఇస్తామని వేధింపులకు గురిచేస్తోందని బాధితురాలు ఆరోపించింది. కాలేజీ యాజమాన్యం నుంచి తన ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇప్పించి న్యాయం చేయాలని కోరుతూ జిల్లా అదనపు కలెక్టర్ పీ.శ్రీనివాస్ రెడ్డికి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారికి బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆమె వెంట పీడీఎస్యూ నాయకులు పడిశాల మధుసూదన్ రావు, ఎస్.కే. మస్తాన్, ఖమ్మం జిల్లా ఎస్సీ సంక్షేమ సంఘం కార్యదర్శి దుమాల నాగరాజు ఉన్నారు.

