వయోవృద్ధులు సమాజానికి మార్గదర్శకులు: అడిషనల్ కలెక్టర్

కలం, కరీంనగర్: వయోవృద్ధులు తమ జీవిత అనుభవాలతో నవ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే మార్గదర్శకులని, వారిని గౌరవించడం మన బాధ్యత అని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ( Additional Collector Ashwini Tanaji Wakade) అన్నారు. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం వేడుకలు కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం జరిగాయి. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో వృద్ధాప్యం అనేది ఒక సహజమైన దశ అని, సమాజం దానిని బలహీనతగా చూడకుండా గౌరవించాలని పిలుపునిచ్చారు. మన సంస్కృతిలో పెద్దల సలహాలు, దీవెనలు ఎంతో అమూల్యమైనవని తెలిపారు. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసి, ఎన్నో త్యాగాలు చేసిన వృద్ధులకు వృద్ధాప్యంలో గౌరవప్రదమైన జీవనం, సరైన సంరక్షణ అందించడం కుటుంబంతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వయోవృద్ధుల భద్రత, రక్షణ, సంక్షేమం కోసం అనేక చట్టాలు, పథకాలను అమలు చేస్తున్నాయని అడిషనల్ కలెక్టర్  అన్నారు. దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ వీటిని అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేసేందుకు పని చేస్తోందని తెలిపారు. వృద్ధుల శారీరక, మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం జిల్లాలో ప్రత్యేక వైద్య శిబిరాలను, సేవలను నిరంతరం అందుబాటులో ఉంచుతామని అన్నారు. వృద్ధులు తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని.. యోగ, వ్యాయామం వంటివి అలవర్చుకోవాలని సూచించారు.

అనంతరం జిల్లాలో వయోవృద్ధుల సంక్షేమం కోసం నిస్వార్థంగా సేవలు అందిస్తున్న పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను, సీనియర్ సిటిజన్లను శాలువాతో ఘనంగా సత్కరించి, పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, వివిధ వృద్ధాశ్రమాల నిర్వాహకులు, సీనియర్ సిటిజన్ల అసోసియేషన్ ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో వయోవృద్ధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>