కలం, నకిరేకల్ : రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారుల అప్రమత్తత, క్రమశిక్షణతో కూడిన డ్రైవింగే సరైన ఆయుధాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (SP Sharath Chandra Pawar) తెలిపారు. ‘అరైవ్–అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, సర్వేజన ఫౌండేషన్ సహకారంతో చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద ఎన్‌హెచ్–65 జాతీయ రహదారిపై భారీ వాహనాలు, ట్రక్కుల డ్రైవర్ల కోసం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. ఈ శిబిరంలో వందలాది మంది డ్రైవర్లకు వైద్య నిపుణులు కంటి పరీక్షలు నిర్వహించి, దృష్టి లోపాలు ఉన్న వారికి ఉచితంగా కంటి అద్దాలను అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ (SP Sharath Chandra Pawar) మాట్లాడుతూ.. జాతీయ రహదారులపై రాత్రింబవళ్లు సుదీర్ఘ ప్రయాణాలు చేసే భారీ వాహనాల డ్రైవర్లలో కంటి అలసట, నిద్రలేమి కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. రోడ్డుపై ఇతరులు తప్పులు చేసే అవకాశం ఉందనే విషయాన్ని ఊహించి డ్రైవింగ్ చేయాలని, సురక్షిత దూరం పాటిస్తూ పరిమితి వేగంతో వాహనాలు నడపాలని సూచించారు. గత ఏడాది జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో సుమారు 350 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా ఉన్నారని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఏడాది ఇప్పటివరకు హెల్మెట్ లేకపోవడం వల్ల 32 మంది మృతి చెందారని, హెల్మెట్ అనేది చలానా నుంచి తప్పించుకోవడానికి కాదని, ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని స్పష్టం చేశారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడడం వంటి నిర్లక్ష్య చర్యలకు దూరంగా ఉండాలని ఎస్పీ హెచ్చరించారు. ప్రయాణంలో అలసటగా అనిపిస్తే సురక్షిత ప్రదేశంలో వాహనాన్ని నిలిపి విశ్రాంతి తీసుకున్నాకే ప్రయాణాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
సామాజిక బాధ్యతతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చిన ‘సర్వేజన ఫౌండేషన్’ ప్రతినిధులను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ కే. శివరాం రెడ్డి, ఎస్‌బీ సీఐ నాగరాజు, ఎస్‌ఐలు వెంకట్ రెడ్డి, విష్ణు, డీటీఆర్‌బీ రిటైర్డ్ సీఐ అంజయ్య, స్థానిక సర్పంచ్ బొంత చంద్రా రెడ్డి, సర్వేజన ఫౌండేషన్ ప్రతినిధి ప్రవీణ్ కుమార్, డాక్టర్ ప్రదీప్, లారీ అసోసియేషన్ సభ్యులు, పోలీస్, వైద్య సిబ్బంది, భారీ వాహనాల డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read : ఢిల్లీలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం..
Follow Us On: Youtube

