దమ్ముంటే బహిరంగ చర్చకు రండి.. మంత్రులకు నిరంజన్‌రెడ్డి సవాల్

కలం, వనపర్తి: కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ (కేఎల్‌ఐ) పంపులను నిర్విరామంగా నడిపి, జూరాల నుంచి నీటిని విడుదల చేసి పాలమూరు రైతుల పంటలను కాపాడాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (Singireddy Niranjan Reddy) డిమాండ్‌ చేశారు. జూరాలలో నీటి లభ్యత ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఈ నెల 12వ తేదీలోగా నార్లపూర్‌ పంపులను ప్రారంభించకపోతే వేలాది మంది రైతులతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు. వనపర్తిలోని తన నివాసంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

నిర్వహణ లోపాలే కారణం..

కేఎల్‌ఐ, జూరాల ఎడమ, కుడి కాలువలు, భీమా పరిధిలో ప్రస్తుతం సుమారు 6–7 లక్షల ఎకరాల్లో పంటలు సాగులో ఉన్నాయని నిరంజన్‌రెడ్డి (Niranjan Reddy) పేర్కొన్నారు. పంటలు తుది దశలో ఉన్న సమయంలో నీరు అత్యవసరమని, పంపులు సక్రమంగా నడపకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. కరెంటు కోతల కారణంగా పంపుల మోటార్లు, బేరింగ్లు, థ్రస్ట్‌ ప్యాడ్లు దెబ్బతింటున్నాయని, నిర్వహణ లోపాలే ఇందుకు కారణమని ఆరోపించారు.

కేఎల్‌ఐలో నీటి లభ్యత ఉన్నప్పటికీ పంపులను ఎందుకు నడపడం లేదని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. తాగునీటి అవసరాలకు కొంత నీటిని కేటాయించిన తర్వాత కూడా సాగునీటికి నీరు అందించే అవకాశం ఉందన్నారు. కేఎల్‌ఐలోని మూడు పంపులను నడిపితే పంటలను కాపాడటంతో పాటు చెరువులు, వాగులు నింపే అవకాశం ఉంటుందని తెలిపారు. నిపుణుల సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని విమర్శించారు.

నన్ను ఏమీ చేయలేరు..

తనపై వ్యక్తిగతంగా నిరాధార ఆరోపణలు, దుష్ప్రచారం చేస్తున్నారని నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. తన ఆస్తులన్నింటి వివరాలను బహిరంగంగా వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తన ఆస్తుల్లో ఒక్క అరగుంట భూమిని ఆక్రమించినట్లు అధికారులు, మీడియా సమక్షంలో నిరూపిస్తే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతానని సవాల్‌ చేశారు.

పానగల్‌లోని వ్యవసాయ క్షేత్రం తన కష్టార్జితమని, తనపై వందల ఎకరాల భూముల ఆక్రమణ ఆరోపణలు చేసినా ఇప్పటివరకు నిరూపించలేకపోయారని అన్నారు. 90 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించారంటూ చేసిన ఆరోపణలు చివరకు 19 గుంటలకు పరిమితమయ్యాయని పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లోనై అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

నిరూపించలేకపోతే ముక్కు నేలకు రాస్తారా?

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు తమ కలెక్టర్లు, అధికారులను, రాష్ట్ర మీడియాను తీసుకుని బహిరంగ చర్చకు రావాలని నిరంజన్‌రెడ్డి సవాల్‌ చేశారు. తన భూములపై ఉన్న ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలని కోరారు. తన వ్యవసాయ క్షేత్రంలోనే టెంట్లు వేసి చర్చకు ఏర్పాట్లు చేస్తానని, ముందస్తుగా సమాచారం ఇస్తే తానే భోజన ఏర్పాట్లు కూడా చేస్తానని వ్యాఖ్యానించారు.

ప్రజా సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన సమయంలో తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రైతులకు విద్యుత్‌, సాగునీరు, యూరియా, రుణమాఫీ, రైతుభరోసా వంటి అంశాల్లో ఇబ్బందులు ఉన్నాయని, వాటిపై ప్రశ్నిస్తే తనపై దుష్ప్రచారం చేయడం చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు.

ఈ సమావేశంలో గట్టు యాదవ్‌, బి.లక్ష్మయ్య, వాకిటి శ్రీధర్‌, లక్ష్మారెడ్డి, నందిమల్ల అశోక్‌, కృష్ణానాయక్‌, మాణిక్యం, ఉగ్లమ్ తిరుమల్, వనం రాములు, రాళ్ల కృష్ణయ్య, గంధం పరంజ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

Also Read : జ‌పాన్‌లో వినూత్న పోటీ.. నిద్ర పోతే ల‌క్ష‌ల్లో బ‌హుమ‌తి!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>