కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జడ్చర్ల మండలం అమ్మపల్లి గ్రామంలో చేపట్టనున్న భూముల రీసర్వేపై నిర్వహించిన గ్రామసభ/అవగాహన సదస్సులో మహబూబ్‌నగర్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జె.ఎల్.బి. హరిప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో భూముల రీసర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. రీసర్వేలో ఆధునిక రోవర్ సర్వే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భూములను ఖచ్చితంగా కొలవడంతో పాటు, భూముల హద్దులను నిర్ధారించడం జరుగుతుందని వివరించారు.
రీసర్వే పూర్తయిన అనంతరం భూముల హద్దులను స్పష్టంగా గుర్తించి, సంబంధిత భూయజమానులకు ల్యాండ్ పార్సెల్ మ్యాప్స్ (LPMs) అందజేయడం జరుగుతుందని తెలిపారు. భూముల హద్దులు, రెవెన్యూ రికార్డులకు సంబంధించి భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా, సమగ్రంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రీసర్వే కార్యక్రమం సజావుగా, సమర్థవంతంగా పూర్తయ్యేందుకు గ్రామస్థులు అధికారులకు పూర్తి సహకారం అందించాలని అదనపు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీ ఎస్‌ఎల్‌ఆర్, జడ్చర్ల తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, మండల సర్వేయర్, రెవెన్యూ అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

