కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీకి (Future City) ప్రత్యేకంగా పోలీస్ కమిషనరేట్‌ను గతంలోనే ఏర్పాటు చేయగా.. తాజాగా దాని హద్దులను నిర్ధారిస్తూ హోంశాఖ సెక్రటరీ శిఖా గోయల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు మహేశ్వరం జోన్ మాత్రమే ఉండగా.. కొత్తగా షాద్‌నగర్, చేవెళ్ల జోన్‌లు కూడా ఏర్పాటవుతున్నాయి. ఇంతకాలం ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, మహేశ్వరం డివిజన్లు మాత్రమే ఉండగా.. తాజాగా ఆమన్‌గల్, కొత్తూరు, మొయినాబాద్ డివిజన్లు ఏర్పడుతున్నాయి.
ఇంతకాలం మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎల్బీనగర్ జోన్‌లో ఉన్న వనస్థలిపురం డివిజన్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్, దాని పరిధిలోని 15 గ్రామాలు ఇకపై మహేశ్వరం జోన్‌లోని ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోకి మారనున్నాయి. అజీజ్‌నగర్ పోలీస్ స్టేషన్‌తో పాటు మహేశ్వరం, షాద్‌నగర్, చేవెళ్ల మహిళా పోలీస్ స్టేషన్లు కూడా ఫ్యూచర్ సిటీ పరిధిలోకి మారుతున్నాయి. ట్రాఫిక్ జోన్ 1, 2లతో పాటు చేవెళ్ల, షాద్‌నగర్, మహేశ్వరం ట్రాఫిక్ డివిజన్లు, మొయినాబాద్, కొత్తూరు, ఆమన్‌గల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు కూడా ఫ్యూచర్ సిటీలో భాగం కానున్నాయి. ఇంతకాలం గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్‌గా పిలుచుకున్నది.. ఇకపై మీర్‌ఖాన్‌పేట్ పోలీస్ స్టేషన్‌గా మారనున్నది.

