వనపర్తి మిల్లర్లకు అదనపు కలెక్టర్‌ కీలక ఆదేశాలు

కలం, వనపర్తి: ఖరీఫ్‌ 2026–27 సీజన్‌లో నిబంధనల ప్రకారం బ్యాంకు గ్యారంటీలు సమర్పించిన రైస్‌ మిల్లర్లకే (Rice Millers) వరిధాన్యం కేటాయింపులు చేస్తామని వనపర్తి (Wanaparthy) జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) వినోద్‌కుమార్‌ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నాన్‌-డిఫాల్టర్‌ రైస్‌ మిల్లర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుతం 43 రైస్‌ మిల్లులు నాన్‌-డిఫాల్టర్‌ జాబితాలో ఉన్నాయని తెలిపారు. ఖరీఫ్‌ సీజన్‌ ధాన్యం కొనుగోళ్లు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ప్రభుత్వ నిబంధనల మేరకు బ్యాంకు గ్యారంటీలు సమర్పించిన మిల్లర్లకే ధాన్యం కేటాయింపులు ఉంటాయని చెప్పారు. నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించే మిల్లర్లకు అవసరమైన సహకారం అందిస్తామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మిల్లర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు

గోడౌన్ల వద్ద ధాన్యం అన్లోడింగ్‌లో జాప్యం, మిల్లింగ్‌ ఛార్జీలకు సంబంధించిన సమస్యలను మిల్లర్లు అదనపు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వినోద్‌కుమార్‌ హామీ ఇచ్చారు. ధాన్యం కేటాయింపులు, మిల్లింగ్‌, అన్లోడింగ్‌ తదితర అంశాల్లో అధికారులు, మిల్లర్లు సమన్వయంతో పనిచేసి ఖరీఫ్‌ సీజన్‌ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ హరీష్‌, పౌరసరఫరాల శాఖ అధికారి ఆంజనేయులు, సంబంధిత అధికారులు, రైస్‌ మిల్లర్లు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>