లేబర్ కోడ్స్‌తో కార్మికుల హక్కులకు తూట్లు : ఏఐటీయూసీ

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం అసంబద్ధంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ కార్మికులను బానిసలుగా మారుస్తున్నాయని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ మండిపడ్డారు. మంగళవారం మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రంలోని సురవరం వెంకట్రామారెడ్డి భవన్‌లో ఆల్ ఇండియా ట్రేడ్ కాంగ్రెస్ (AITUC) కౌన్సిల్ సమావేశం బి. కృష్ణ యాదవ్ అధ్యక్షతన జరిగింది. అనంతరం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికై తొలిసారి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి వచ్చిన ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరసింహను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎం. నరసింహ మాట్లాడుతూ.. బ్రిటిష్ కాలం నుంచి కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను సవరణల పేరుతో కేంద్ర నరేంద్ర మోదీ ప్రభుత్వం మారుస్తూ, కార్మిక సంక్షేమ చట్టాలకు తూట్లు పొడుస్తూ, కార్పొరేట్ కంపెనీ యాజమాన్యాలకు, ఆర్థిక కుబేరులకు కార్మికుల శ్రమను దోచిపెట్టే విధంగా విధాన నిర్ణయాలు కొనసాగించడం దుర్మార్గమని అన్నారు. 8 నుంచి 12 గంటలకు పని గంటలను పెంచడమే కాకుండా కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్‌లో కూడా అనేక కొర్రీలు పెడుతున్నారని అన్నారు. కార్మిక చట్టం ప్రకారం ఏడుగురు కార్మికులు ఉంటే సంఘం రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేదని, ప్రస్తుత లేబర్ కోడ్స్‌తో 100 మంది ఉంటేనే కార్మిక సంఘం ప్రభుత్వ గుర్తింపు, రిజిస్ట్రేషన్ అనే అంశం ఉండటంతో తక్కువమంది పనిచేసే కర్మాగారాలు, కంపెనీలు, వ్యాపార సముదాయాల్లోని కార్మికులు కార్మిక చట్టం పరిధిలోకి రాకుండా పోయే ప్రమాదం ఏర్పడిందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం పెంచామని సంబరపడుతున్నప్పటికీ, వాస్తవంగా ప్రస్తుతం కొనసాగుతున్న కనీస వేతనాల కంటే తక్కువగా కనీస వేతనం నిర్ణయించిందని ధ్వజమెత్తారు. కనీస వేతన జీవో 6ను సవరించి కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్, ఎన్ఎంయూ, టీఎంయూ కూటమి బస్సు, కాగడ గుర్తులపై ఆర్టీసీ గుర్తింపు హక్కుల గొంతులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్మిక హక్కుల సాధనకై కార్మిక వర్గం రాజీలేని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి బి. బాలకిషన్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలంటే కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ బోర్డులు నెలకొల్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు భాగ్య కృష్ణ యాదవ్, ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి మధుసూదన్ రెడ్డి, జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఆంజనేయులు, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. దేవానంద్, జిల్లా ఉపాధ్యక్షులు బి. చెన్నయ్య, రంగన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు, నాయకులు గోపాల్ నాయక్, బాలకోటి, అంజి, యాదయ్య, సాయి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>