కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిత్వాన్ని, ఆయన కటుంబాన్ని బద్నాం చేసేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ (Indira Shobhan) మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీరామచంద్రుడి వంటి వ్యక్తి అని, దేశంలో ఎక్కడ అడిగినా ఆయన స్వచ్ఛమైన వ్యక్తిత్వం గురించే చెబుతారని ఆమె కొనియాడారు. రేవంత్ రెడ్డి నాయకత్వానికి వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేకనే బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా వేదికగా అడ్డగోలు రాతలు రాస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
గత మూడేళ్లుగా రేవంత్ రెడ్డి సోదరులు తిరుపతిరెడ్డి, కొండల్ రెడ్డిల పేర్లను అనవసరంగా రాజకీయంలోకి లాగడం, వారిపై నిందలు వేయడం బీఆర్ఎస్ నాయకులకు అలవాటుగా మారిందని ఇందిరా శోభన్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రతిష్ఠను, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు చేస్తే కాంగ్రెస్ శ్రేణులు ఏమాత్రం ఊరుకోబోమని స్పష్టం చేశారు.

